Published : 10 Nov 2021 01:33 IST

Lac: చైనా విషయంలో భారత్‌.. ఏమాత్రం తగ్గేదేలే..!

 మరో శీతాకాలం ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

వాస్తవాధీన రేఖ వద్ద సంక్షోభం రెండో ఏడాది పూర్తి చేసుకునే దిశగా వెళుతోంది. భారత సైన్యం చైనాతోపాటు శీతాకాలాన్ని కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు చకచక ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక్కడ శీతాకాలంలో దాదాపు మైనస్‌ 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న తప్పు చేసినా.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే.  ఇప్పటికే భారీ సంఖ్యలో ఎల్ఏసీ వద్ద దళాలు మోహరించాయి. భారత్‌-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 

అక్టోబర్‌లో ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే మాట్లాడుతూ  ‘తూర్పు  లద్దాఖ్‌లో చైనా వైపు సైనిక మోహరింపులు, సరికొత్త నిర్మాణాలు ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఒక వేళ చైనా సేనలు అక్కడే కొనసాగితే భారత్‌ దళాలు వెనక్కి తగ్గే అవకాశమే లేదు’ అని స్పష్టం చేశారు. భారత్‌ ఇప్పటికే 50,000 మందికిపైగా సైనికులను, శతఘ్నులు, ప్రధాన యుద్ధ ట్యాంకులు, ఆకాశ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌, ఉపరితలంపై నుంచి గగనతలంపైకి వేగంగా దాడిచేయగల క్షిపణులు, ఇగ్లా-ఎస్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ, పినాకా మల్టీబ్యారెల్‌ రాకెట్‌ లాంఛర్లు, సాయుధ వాహనాలు, హై మొబిలిటీ వెహికల్స్‌ను తరలించింది.

ఒక్కో సైనికుడిపై ఆరు నెలల్లో రూ.11 లక్షలు..

సరిహద్దు రక్షణకు సైనిక మోహరింపుల్లో భారత్‌ ఏమాత్రం వెనకాడటం లేదు. బలగాలకు అవసరమైన ఆయుధాలు, ఇతర పరికరాలను రేయింబవళ్లు సరిహద్దులకు తరలిస్తోంది. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు ప్రతి సైనికుడిపై 15,000 డాలర్లు ( రూ.11 లక్షలు) వెచ్చించనుంది. సైనిక రవాణా విభాగంలో నిపుణులైన మేజర్‌ జనరల్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. సైన్యానికి శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు రేషన్‌, ఔషధాలు, ఇంజినీరింగ్‌ పరికరాలు, మందుగుండు, ఇతర పరికరాలు, దుస్తులు, అతిశీతల పరిస్థితుల్లో వినియోగించే వాహనాలు తరలిస్తున్నామని చెప్పారు.

ప్రతి సైనికుడికి మొత్తం 80 రకాల ఐటమ్స్‌ అవసరం. సైనికులు ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి, వాహనాల వినియోగానికి భారీగా కిరోసిన్‌, ప్రత్యేకమైన డీజిల్‌, పెట్రోల్‌ వంటివి తప్పనిసరి. ఈ క్రమంలో సరిహద్దులకు 50 లక్షల టన్నుల వస్తువులను భారత ప్రభుత్వం పంపిస్తోంది.

సీ-17 విమానానికి గంటకు రూ.2.5 కోట్లు..

ఈ సరఫరాల్లో అవసరాలను బట్టి కొన్నింటిని తప్పనిసరిగా విమానాల్లో పంపాల్సిందే. మరికొన్ని ట్రక్కుల్లో వెళతాయి. ట్రక్కులో 10 టన్నుల సరుకుల చేరవేతకు ట్రిప్పుకు రూ. 1.1లక్షలు వెచ్చించాలి. 50 టన్నులు మోయగల సీ-17 ఎయిర్‌ క్రాఫ్ట్‌ గంటసేపు ప్రయాణానికి  రూ.2.5 కోట్లు ఖర్చవుతుంది.

వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైనికులను చలి నుంచి రక్షించేందుకు ప్రత్యేకమైన క్యాంపులను ఏర్పాటు చేసింది. వీటికి విద్యుత్తు, మంచినీరు, క్యాంపును వేడిగా ఉంచే హీటర్లు వంటి సౌకర్యాలను కల్పించారు. తూర్పు లద్దాఖ్‌లో  వాస్తవాధీన రేఖ పొడవునా వీటిని నిర్మించారు. ఇందుకోసం రూ.738 కోట్లు వెచ్చించారు. వీటికి అదనంగా మరిన్ని బంకర్లు అవసరమని సైనికాధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాలను కూడా చలి బారి నుంచి రక్షించేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేపడుతున్నారు.

నిఘా కోసం ప్రత్యేక ఏర్పాట్లు

దట్టంగా కురిసే మంచులో గస్తీకాయడం అంత తేలికకాదు. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్‌, లక్ష్యాలపై నిఘా వంటి వాటికి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం టాక్టికల్‌ డ్రోన్స్‌, రికానసన్స్‌ అండ్‌ అబ్జర్వేషన్‌ సిస్టమ్స్‌, బ్యాటిఫీల్డ్‌ రాడార్స్‌, దిగువ భూకక్ష్యలోని ఉపగ్రహాలను కూడా వినియోగించేందుకు సిద్ధం చేశారు. వచ్చే రెండేళ్లలో భారత ఈ సామర్థ్యాలను మరింత పెంచుకొనేందుకు రూ.3.6 వేల కోట్లు వెచ్చించవచ్చు.

భారత్‌తో వివాదం.. చైనా సైనికులకు అనుభవం..!

ఇటీవల అమెరికా రక్షణశాఖ ఇచ్చిన నివేదికలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భారత్‌తో ఘర్షణ కారణంగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ కీలకమైన అనుభవాన్ని సంపాదించుకుంటోందని పేర్కొంది. బలగాల తరలింపు, మోహరింపు, వాస్తవిక పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్‌ సమాచార సేకరణ వంటి అంశాలను పీఎల్‌ఏ  తెలుసుకుంటోందని పేర్కొంది.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని