24 గంటల్లో 43లక్షల మందికి టీకా 

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. 24 గంటల వ్యవధిలో 43 లక్షలకు పైగా మందికి టీకాలు

Published : 06 Apr 2021 15:02 IST

వ్యాక్సిన్‌ పంపిణీలో ఇదే అత్యధికం

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. 24 గంటల వ్యవధిలో 43 లక్షల మందికి పైగా టీకాలు అందించింది. దేశంలో టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో వ్యాక్సిన్లు వేయడం ఇదే తొలిసారి.

ఏప్రిల్‌ 5న మొత్తం 43,00,966 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. ఇందులో తొలి డోసు తీసుకున్నవారు 39 లక్షలయితే, రెండో డోసు తీసుకున్నవారు 4 లక్షల మంది ఉన్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 8.3 కోట్లు దాటినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ఉదయం 7 గంటల సమయానికి దేశంలో మొత్తంగా 8,31,10,926 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 81 లక్షలు, గుజరాత్‌లో 76లక్షలు, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 71 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో 65 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. 

8 రాష్ట్రాల్లోనే 80 శాతం కేసులు 

మరోవైపు దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 96,982 మంది వైరస్‌ బారిన పడ్డారు. అయితే కొత్త కేసుల్లో 80 శాతం కేవలం 8 రాష్ట్రాల్లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 47,288, ఛత్తీస్‌గఢ్‌లో 7,302, కర్ణాటకలో 5,279 కొత్త కేసులు బయటపడ్డాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌, తమిళనాడు, దిల్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లోనూ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. 

57 శాతం క్రియాశీల కేసులు మహారాష్ట్రలోనే

కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,88,223 యాక్టివ్‌ కేసులుండగా, క్రియాశీల రేటు 6.21 శాతంగా ఉంది. అయితే వీటిలో 57.42శాతం కేసులు కేవలం మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 4.51 లక్షల క్రియాశీల కేసులున్నాయి.

13 రాష్ట్రాల్లో వైరస్‌ అదుపులోనే

అయితే కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ అదుపులో ఉండటం ఊరటనిస్తోంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించలేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒడిశా, అస్సాం, పుదుచ్చేరి, మేఘాలయ, మణిపూర్‌, త్రిపుర, లక్షద్వీప్‌, మిజోరం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్‌, లద్దాఖ్‌, నాగాలాండ్‌, దాద్రానగర్‌ హవేలీ-డయ్యూడామన్‌లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు కరోనా మరణాలు లేవన్న సమాచారం ఊరట కలిగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు