EPI 2022: ‘పర్యావరణ పనితీరు సూచీ’ అశాస్త్రీయం.. నివేదికను తోసిపుచ్చిన భారత్‌..!

పర్యావరణ పనితీరు సూచీల్లో భారత్‌ ప్రపంచంలోనే చిట్టచివరి స్థానంలో నిలిచిందని ఇటీవల వచ్చిన నివేదికపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మండిపడింది.

Published : 09 Jun 2022 01:21 IST

కీలక సూచీలను పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం

దిల్లీ: పర్యావరణ పనితీరు సూచీల్లో భారత్‌ ప్రపంచంలోనే చిట్టచివరి స్థానంలో నిలిచిందని ఇటీవల వచ్చిన నివేదికపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మండిపడింది. అందులో కొన్ని సూచీలు మునుపటి గణాంకాల ఆధారంగా రూపొందించినవే కాకుండా ఊహించుకొని చెప్పినవని పేర్కొంది. అంతర్జాతీయ సంస్థలు రూపొందించిన తాజా నివేదికలో పలు సూచీలు అశాస్త్రీయ పద్ధతిలో ఉన్నాయని పర్యావరణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

‘పర్యావరణ పనితీరుపై తాజాగా విడుదలైన నివేదికలో చాలా సూచీలు ఆధారాలు లేని, ఊహాజనితమైనవి. దేశంలో కర్బన నిల్వలకు కేంద్రంగా ఉన్న అడవులు, చిత్తడి నేలలను పరిగణనలోకి తీసుకోలేదు. ఉద్గారాలు తగ్గినప్పటి సమాచారాన్ని ఆ నివేదిక విస్మరించింది. నీటి నాణ్యత, సమర్థమైన నీటి వినియోగం, వ్యర్థాల ఉత్పత్తి వంటి సూచీలు సుస్థిర వినియోగం కిందకే వస్తున్నప్పటికీ ఈ నివేదికలో వాటిని పొందుపరచలేదు. అంతేకాకుండా మెరగైన పనితీరు కనబరిచిన సూచీలను కూడా తక్కువగా చూపింది. ఇందుకు గల కారణాలను మాత్రం నివేదికలో వివరించలేదు’ అని కేంద్ర పర్యావరణశాఖ పేర్కొంది.

ఇదిలా ఉంటే, ‘పర్యావరణ పనితీరు సూచిక-2022’ పేరుతో యేల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ లా అండ్‌ పాలసీ, సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎర్త్‌ సైన్స్‌ ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌, కొలంబియా యూనివర్సిటీలు సంయుక్తంగా ఓ నివేదిక రూపొందించాయి. 11 విభాగాల్లో మొత్తం 40 రకాల పనితీరు సూచికల ఆధారంగా ఈ జాబితా సిద్ధం చేయగా.. అందులో అత్యల్పంగా 18.9 మార్కులు సాధించిన భారత్‌ అట్టడుగున నిలిచింది. మయన్మార్‌-19.4, వియత్నాం-20.1, బంగ్లాదేశ్‌-23.01, పాకిస్థాన్‌-24.6 మార్కులతో భారత్‌ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. వాయు నాణ్యతలో ప్రమాదకర స్థాయిలు పెరుగుదల, విపరీతంగా పెరుగుతున్న గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల కారణంగా భారత్‌ తొలిసారి ఈ ర్యాంకింగుల్లో అట్టడుగు స్థానానికి పడిపోయినట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే, ఈ జాబితాలో పేర్కొన్న పలు సూచీలు అశాస్త్రీయంగా ఉన్నాయంటూ భారత్‌ ఈ నివేదికను తోసిపుచ్చింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని