India Corona: కొత్త కేసులు 1.79లక్షలు.. 2శాతానికి పైనే క్రియాశీల రేటు..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 13.52లక్షల మంది వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 1,79,723 మందికి

Updated : 10 Jan 2022 13:34 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 13.52లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 1,79,723 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల్లో 12.6శాతం పెరుగుదల కన్పించింది. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 13.29శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, ఇదే సమయంలో 46,569 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 96.62శాతంగా ఉంది.

2శాతానికి పైనే క్రియాశీల రేటు..

కొత్త కేసుల పెరుగుదలతో దేశంలో క్రియాశీల కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నాటికి 5.90లక్షలుగా ఉన్న యాక్టివ్‌ కేసులు ప్రస్తుతం 7.23లక్షలకు పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,23,619 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 2.03శాతానికి పెరిగింది. మరోవైపు, ఒక రోజు వ్యవధిలో 146 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు 4,83,936 మందిని వైరస్‌ బలితీసుకుంది. 

4వేలు దాటిన ఒమిక్రాన్‌ కేసులు

దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. ఇప్పటివరకు మొత్తంగా 4,033 మంది కొత్త వేరియంట్‌ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1,216 ఒమిక్రాన్‌ కేసులు రాగా.. రాజస్థాన్‌లో 529, దిల్లీలో 513, కర్ణాటకలో 441 కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,552 మంది ఒమిక్రాన్‌ బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 

151 కోట్లు దాటిన వ్యాక్సినేషన్‌

మరోవైపు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఆదివారం 29.60లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 151.94కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఏడాది వ్యాక్సినేషన్‌ను మరింత విస్తరించిన విషయం తెలిసిందే. జనవరి 3 నుంచి 15 - 18 ఏళ్ల వారికి టీకాలు ఇస్తుండగా.. నేటి నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని