Corona: 20వేల దిగువకు కొత్త కేసులు.. 209 రోజుల్లో ఇదే కనిష్ఠం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. గత కొద్ది రోజులుగా 20వేలపైనే కొనసాగుతున్న కొత్త కేసులు.. తాజాగా ఆ మార్క్‌ దిగువకు పడిపోయాయి.

Updated : 05 Oct 2021 10:57 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. గత కొద్ది రోజులుగా 20వేలపైనే కొనసాగుతున్న కొత్త కేసులు.. తాజాగా ఆ మార్క్‌ దిగువకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11.41లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,346 మందికి పాజిటివ్‌గా తేలింది. కొత్త కేసులు ఇంత తక్కువగా నమోదవడం 209 రోజుల్లో ఇదే తొలిసారి. అయితే ఇదే సమయంలో మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతక్రితం రోజున మరణాల సంఖ్య 200 దిగువకు పడిపోగా.. తాజాగా నిన్న 263 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో సగానికి పైగా మరణాలు ఒక్క కేరళలోనే నమోదవడం గమనార్హం. ఆ రాష్ట్రంలో నిన్న 8,850 కొత్త కేసులు వెలుగుచూడగా.. 149 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు 4,49,260 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. 

అయితే కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం కాస్త సానుకూలాంశం. నిన్న మరో 29,639 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 3.31కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.93శాతానికి పెరిగింది. ఇక కొత్త కేసులు తగ్గుతుండటంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 200 రోజుల కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,52,902 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.75శాతంగా ఉంది. 

91కోట్లు దాటిన టీకాల పంపిణీ..

ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దూసుకెళ్తోంది. నిన్న మరో 72.51లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 91.54కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని