Corona: కాస్త తగ్గిన మహమ్మారి ఉద్ధృతి.. అయినా 2 లక్షలకు పైనే కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 16.49లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 2,38,018 మందికి పాజటివ్‌గా తేలింది. అయితే క్రితం రోజుతో

Updated : 18 Jan 2022 10:08 IST

17లక్షలు దాటిన క్రియాశీల కేసులు 

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 16.49లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 2,38,018 మందికి పాజటివ్‌గా తేలింది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు 20వేలకు పైగా తగ్గడం కాస్త సానుకూలాంశం. ఇక పాజిటివిటీ రేటు కూడా 19.65శాతం నుంచి 14.43శాతానికి తగ్గడం ఊరటనిస్తోంది. మరోవైపు 24 గంటల వ్యవధిలో మరో 310 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,86761 మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. 

లక్షన్నర మంది రికవరీ..

ఇదిలా ఉండగా.. వైరస్‌ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 1,57,421 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 94.09శాతంగా ఉంది. అయితే, కొత్త కేసుల పెరుగుదలతో యాక్టివ్‌ కేసులు మాత్రం ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17,36,628 మంది కరోనాతో బాధపడుతుండగా క్రియాశీల రేటు 4.62శాతంగా ఉంది. 

9వేలకు చేరువలో ఒమిక్రాన్‌ కేసులు

మరోవైపు జన్యుపరీక్షల్లో తేలిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 9వేలకు చేరువైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,891 మందిలో కొత్త వేరియంట్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. క్రితం రోజుతో పోలిస్తే ఒమిక్రాన్‌ కేసులు 8.31శాతం పెరగడం గమనార్హం.

158కోట్లు దాటిన టీకాల పంపిణీ

ఇక టీకాల పంపిణీ కార్యక్రమం దేశంలో నిర్విరామంగా సాగుతోంది. నిన్న మరో 79.91లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు 158.04కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 15-18 ఏళ్ల వారిలో 3.59లక్షల మందికి తొలి డోసు టీకాలను అందించినట్లు తెలిపింది. ఇక ఇప్పటి వరకు దాదాపు 50లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 60ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్‌ డోసును పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

12-14ఏళ్ల వారికి టీకా.. ఇప్పుడే కాదు

దేశంలో 12-14 ఏళ్ల పిల్లలకు మార్చి నుంచి టీకాలు పంపిణీ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు స్పందించాయి. ఈ వయసు వారికి టీకాల పంపిణీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ వర్గాలు వెల్లడించాయి. 15-18 ఏళ్ల వయసు వారికి టీకా పంపిణీ ముగిసిన తర్వాత.. మార్చి నుంచి 12-14 ఏళ్ల వారికి టీకాలు మొదలయ్యే సూచనలున్నాయని కొవిడ్‌-19 టీకాలపై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.అరోడా సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని