India Corona: మూడు వేలకు దిగువనే కొత్త కేసులు..

దేశంలో కరోనా వైరస్ దాదాపుగా అదుపులోకి వచ్చింది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వరుసగా మూడోరోజు 3 వేలకు దిగువనే నమోదయ్యాయి.

Published : 16 Mar 2022 10:10 IST

 12-14 ఏళ్ల వయస్సువారికి ప్రారంభమైన టీకా పంపిణీ

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ అదుపులోకి వస్తోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వరుసగా మూడోరోజు 3 వేలకు దిగువనే నమోదయ్యాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

మంగళవారం ఏడు లక్షలమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,876 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం దేశంలో మహమ్మారి వ్యాప్తి రెండేళ్ల కనిష్ఠానికి తగ్గి, ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో 98 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

రోజురోజుకూ క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 32,811(0.08 శాతం)గా ఉంది. నిన్న 3,884 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 4.24 కోట్లు(98.82 శాతం) దాటాయి. 

ఈ రోజు నుంచే 12-14 వయస్సువారికి టీకా..

దేశంలో కరోనా టీకా కార్యక్రమం దశలవారీగా కొనసాగుతోంది. ఈ రోజు నుంచి 12 నుంచి 14 ఏళ్ల వయస్సువారికి టీకా పంపిణీ ప్రారంభమైంది. వారికి బయోలాజికల్ ఇ తయారు చేసిన కార్బెవాక్స్ వేస్తున్నారు. ఈ దశలో సుమారు 7.11 కోట్ల మంది చిన్నారులు లబ్ధి పొందనున్నట్లు కేంద్రం అంచనావేస్తోంది. అలాగే 60 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరికీ కూడా ప్రికాషనరీ డోసు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకూ కేంద్రం 180 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసింది. నిన్న 18.9 లక్షల మంది టీకా వేయించుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని