India Corona: మూడు వేలకు చేరువలో కొత్త కేసులు..!

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొద్ది రోజులుగా రెండు వేలకు పైగా నమోదవుతోన్న కొత్త కేసులు.. తాజాగా మూడు వేలకు సమీపించాయి.

Published : 27 Apr 2022 10:12 IST

కొవిడ్ పరిస్థితులపై సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొద్ది రోజులుగా రెండు వేలకు పైగా నమోదవుతోన్న కొత్త కేసులు.. తాజాగా మూడు వేలకు సమీపించాయి. దిల్లీలో వైరస్‌ విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. బుధవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 

మంగళవారం 5.05 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. 2,927 కొత్త కేసులొచ్చాయి. పాజిటివిటీ రేటు 0.58 శాతానికి పెరిగింది. ఒక్క దిల్లీలోనే 1,204 మందికి వైరస్ సోకింది. హరియాణాలో 517 కేసులు నమోదయ్యాయి. కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తోన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4.30 కోట్ల మంది కొవిడ్ బారినపడగా.. 5.23 లక్షల మరణాలు సంభవించాయి. నిన్న ఒక్కరోజే 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో కేరళ ప్రకటించిన సంఖ్యే 26.

24 గంటల వ్యవధిలో 2,252 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉన్నాయి. క్రియాశీల కేసులు 16,279కి చేరాయి. రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు 0.04 శాతంగా కొనసాగుతోంది. ఇక నిన్న 21.97 లక్షల మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటివరకూ 188 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది. 

కొవిడ్ పరిస్థితులపై సీఎంలతో ప్రధాని భేటీ..

దేశంలో కొత్త కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ తీరును సమీక్షించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని