India Corona: నాలుగు వేల దిగువకు కొత్త కేసులు.. 26 మరణాలు

దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. ముందురోజు 4వేలకు పైగా నమోదైన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గాయి.

Published : 04 Jun 2022 10:17 IST

22 వేలు దాటిన క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ముందురోజు 4వేలకు పైగా నమోదైన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గాయి. అయితే క్రియాశీల కేసుల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. శుక్రవారం 4.45 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,962 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 0.89 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కేరళలో కలిపి మరోరోజు రెండు వేలకుపైగా కేసులొచ్చాయి. ఈ రెండింటితో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండంపై నిన్న కేంద్రం ఆయా ప్రభుత్వాలకు హెచ్చరికలు చేసింది. స్థానికంగా ఇన్‌ఫెక్షన్‌ విస్తరించడమే అందుకు కారణం కావొచ్చని అభిప్రాయపడింది. అందువల్ల తక్షణం అప్రమత్తమై కట్టడి చర్యలు తీసుకొని ఇప్పటివరకూ దక్కిన ప్రయోజనాలు చేజారకుండా చూసుకోవాలని సూచించింది.

కొత్త కేసుల ప్రభావం క్రియాశీల కేసులపై పడుతోంది. ప్రస్తుతం వాటి సంఖ్య 22,416 (0.05 శాతం)కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 2,697 మంది కోలుకున్నారు. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 2020 ప్రారంభం నుంచి 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.26 కోట్ల మందిపైగా కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. 5.24 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఇక నిన్న 11.67 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తంగా 193 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని