India Corona: దేశవ్యాప్తంగా అదుపులో ఉన్నా.. దిల్లీలో ఆందోళనకరం..!

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. 24 గంటల వ్యవధిలో 3.64 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 9,062 కొత్త కేసులు వెలుగుచూశాయి.

Published : 17 Aug 2022 10:03 IST

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. 24 గంటల వ్యవధిలో 3.64 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,062 కొత్త కేసులు వెలుగుచూశాయి. ముందురోజు కంటే కొద్దిమేర కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు 2.49 శాతంగా నమోదైంది. నిన్న 15,220 మంది కోలుకున్నారు. గత కొద్ది రోజులుగా క్రియాశీల కేసులు దిగొస్తున్నాయి. ప్రస్తుతం 1.05 లక్షలకు అవి తగ్గాయి. క్రియాశీల రేటు 0.24 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.57 శాతానికి పెరిగిందని బుధవారం కేంద్రం వెల్లడించింది.  

ఇలా దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనే ఉండగా.. రాజధాని నగరం దిల్లీలో పరిస్థితి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ పాజిటివిటీ రేటు 20 శాతానికి చేరువకావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్న 917 మందికి కరోనా సోకింది. ముందురోజు 14.57 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. 19.2 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అక్కడ 5,387 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా.. 563 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చేరిన వారిలో 90 శాతం మంది బూస్టర్‌ డోసు తీసుకోలేదని డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా వెల్లడించారు. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి దేశం మొత్తం మీద 208 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 25.9 లక్షల మంది టీకా తీసుకున్నారు. 12.58 కోట్ల మంది ప్రికాషనరీ డోసు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని