Corona: రెండో రోజూ లక్షకు దిగువనే కొత్తకేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కొత్త కేసులు లక్ష దిగువనే నమోదయ్యాయి.

Updated : 09 Jun 2021 12:43 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా రెండో రోజూ కొత్త కేసులు లక్ష దిగువనే నమోదయ్యాయి. సుమారు రెండు నెలల తరవాత ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. అయితే క్రితం రోజుతో పోల్చితే కేసులు, మరణాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజాగా 92,596 మందికి కరోనా సోకగా..2,219 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.

మంగళవారం 19,85,967 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 92,596 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 2.9 కోట్ల మార్కును దాటాయి. పాజిటివిటీ రేటు రెండో రోజు 5 శాతానికి దిగువనే నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినట్టుగా 5 శాతం దిగువనే ఈ రేటు కొనసాగుతుండటం ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో 2,219 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,53,528కి చేరింది.

ఇక క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతుండగా, రికవరీ రేటు మెరుగవుతోంది. ప్రస్తుతం 12,31,415 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా..క్రియాశీల రేటు 4.50 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 1,62,664 మంది కోలుకోగా..మొత్తం ఈ సంఖ్య 2.75కోట్లకు పైబడింది. రికవరీ రేటు 94.29 శాతానికి చేరింది. మరోవైపు నిన్న 27,76,096 మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 23,90,58,360కి చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని