Corona: కొత్త కేసులు 34వేలు.. రికవరీలు 37వేలు

కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. క్రితం రోజున 40వేలు దాటిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో

Updated : 10 Sep 2021 15:09 IST

దిల్లీ: కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. క్రితం రోజున 40వేలు దాటిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 17.87లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 34,973 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు(43,263)తో పోలిస్తే దాదాపు 8వేల కేసులు తక్కువ.  దీంతో దేశంలో మొత్తం కేసుల 3.31కోట్లు దాటింది. ఇక మరణాలు కూడా మరోసారి 300 దిగువన నమోదవడం కాస్త ఊరటనిస్తోంది. నిన్న 260 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు 4,42,009 మందిని మహమ్మారి బలితీసుకుంది.

ఇక నిన్న 37,681 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.23కోట్ల మంది కరోనాను జయించగా.. రికవరీ రేటు 97.49శాతంగా ఉంది. కొత్త కేసులు తగ్గడంతో యాక్టివ్‌ కేసులు కూడా కాస్త తగ్గాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,90,646 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.18శాతంగా ఉంది. ఇక మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. గురువారం మరో 67.58కోట్ల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 72.37కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో నిబంధనల నడుమే పండగ నిర్వహించాలని ఇప్పటికే కేంద్రంతోపాటు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని