China-Pak-India: మా అంతర్గత వ్యవహారంలో తలదూర్చొద్దు!

జమ్ముకశ్మీర్‌పై ఎప్పటికప్పుడు వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు.. ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్న చైనాకు భారత్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. భారత అంతర్గత వ్యవహరాల్లో తలదూర్చొద్దని స్పష్టం చేసింది. ఇటీవల జమ్ముకశ్మీర్‌కు సంబంధించి చైనా-పాకిస్థాన్‌ చేసిన

Published : 10 Feb 2022 01:47 IST

చైనా, పాకిస్థాన్‌కు భారత్‌ హెచ్చరిక

దిల్లీ: జమ్ముకశ్మీర్‌ అంశంలో ఎప్పటికప్పుడు వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు, ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్న చైనాకు భారత్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల జమ్ముకశ్మీర్‌కు సంబంధించి చైనా-పాకిస్థాన్‌ చేసిన సంయుక్త ప్రకటనపై భారత విదేశాంగశాఖ స్పందిస్తూ.. భారత అంతర్గత వ్యవహరాల్లో తలదూర్చొద్దని హెచ్చరించింది. 

చైనా పర్యటనకు వెళ్లిన పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఫిబ్రవరి 6న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌(CPEC)పై చర్చించారు. అలాగే, జమ్మూకశ్మీర్‌ ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. అనంతరం జిన్‌పింగ్‌ మాట్లాడుతూ ‘‘ఐక్యరాజ్య సమితి సూచనలు, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా కశ్మీర్‌ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి’’అని సూచించారు. పరిస్థితిని తీవ్రతరం చేసే ఏకపక్ష చర్యలను చైనా ఎప్పటికీ వ్యతిరేకిస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘శాంతియుత, సౌభాగ్య దక్షిణాసియానే మా ఉమ్మడి అజెండా’’ అని చైనా, పాక్‌ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. 

ఈ ప్రకటనపై తాజాగా విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బగ్చి మాట్లాడుతూ.. ‘‘చైనా-పాకిస్థాన్‌ సంయుక్త ప్రకటనలో ఇచ్చిన సూచనలను తిరస్కరిస్తున్నాం. భారత్‌ స్థాయి ఏంటో చైనా, పాకిస్థాన్‌కు బాగా తెలుసు. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాలు ఎప్పటికీ భారత భూభాగాలే. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఆ రెండు దేశాలు జోక్యం చేసుకోవని భావిస్తున్నాం. పాకిస్థాన్ ఆక్రమించిన భారత భూభాగంలో చైనా-పాకిస్థాన్‌ కారిడార్‌ ప్రాజెక్టులపై మా వ్యతిరేకతను తెలియజేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్న స్థితిని మార్చడానికి పాకిస్థాన్‌తోపాటు ఏ దేశం ప్రయత్నించినా మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అందుకే, అటువంటి కార్యకలాపాలను నిలిపివేయాలి’’ అని అరిందమ్‌ బగ్చి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని