
India-China: చైనా కొత్త సరిహద్దు చట్టం.. భారత్ ఏమందంటే..
దిల్లీ: భారత్తో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో నూతన సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు నిర్వహణపై చట్టం తీసుకొస్తూ డ్రాగన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఆందోళనకరమేనని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ అన్నారు. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
‘‘అక్టోబరు 23న చైనా నూతన సరిహద్దు చట్టాన్ని ఆమోదించింది. సరిహద్దుల్లో చైనా ప్రజలు నివసించేలా ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ అక్కడి జిల్లాల పునర్నిర్మాణానికి ఈ చట్టం వీలు కలిగిస్తుంది. అంతేగాక, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టం చెబుతోంది. కాగా.. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఇంకా పరిష్కారం కాలేదు. వీటికి చర్చల ద్వారా పరస్పర అంగీకారంతో పారదర్శకంగా పరిష్కారం తీసుకొచ్చేందుకు ఇరు దేశాలు ప్రయ్నతిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ సహా భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. అయితే, తాజాగా సరిహద్దు చట్టం అమలు చేయాలని చైనా తీసుకున్న ఏకపక్ష నిర్ణయం.. ఆ ఒప్పందాలపై ప్రభావం చూపేలా ఉంది. ఇది భారత్కు ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ ఏకపక్ష చర్యలతో సరిహద్దుల్లో పరిస్థితులు, ఇరు దేశాలు చేసుకున్న ఏర్పాట్లు మాత్రం ఏం మారవు. చట్టం పేరు చెప్పి సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చేలా చైనా ఎలాంటి చర్యలు చేపట్టబోదని మేం భావిస్తున్నాం’’ అని బాగ్చీ వెల్లడించారు.