MEA: ఆంగ్‌ సాన్‌ సూచీకి జైలుశిక్షపై స్పందించిన భారత్‌.. ఏమన్నదంటే?

మయన్మార్‌ సీనియర్‌ నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూచీకి ఆ దేశ సైనిక ప్రభుత్వం నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కొవిడ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించడం, అశాంతిని రేకెత్తించడం అభియోగాలపై కోర్టు ఆమెను దోషిగా తేల్చి, ఈ మేరకు తీర్పు చెప్పింది. అనంతరం...

Published : 07 Dec 2021 23:50 IST

దిల్లీ: మయన్మార్‌ సీనియర్‌ నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూచీకి ఆ దేశ సైనిక ప్రభుత్వం నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కొవిడ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించడం, అశాంతిని రేకెత్తించడం అభియోగాలపై కోర్టు ఆమెను దోషిగా తేల్చి, ఈ మేరకు తీర్పు చెప్పింది. అనంతరం ఈ శిక్షను నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. మరోవైపు ఈ శిక్షల విషయమై ఆయా దేశాలతోపాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తదితర సంస్థలు.. మయన్మార్‌ సైన్యం తీరును విమర్శిస్తున్నాయి. ఇదే క్రమంలో భారత్ సైతం.. ఈ తీర్పుల విషయంలో కలత చెందినట్లు ప్రకటించింది. స్థానికంగా చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్య ప్రక్రియ అవసరమని పేర్కొంది.

‘చర్చలతో పరిష్కరించుకోవాలి’

‘మయన్మార్‌లో ఇటీవల వెలువడిన తీర్పులపై కలత చెందాం. పొరుగున ఉన్న ప్రజాస్వామ్య దేశంగా.. మయన్మార్‌లోనూ ప్రజాస్వామ్య పరివర్తనకు భారత్‌ స్థిరంగా మద్దతు ఇస్తోంది’ అని విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ అన్నారు. చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్య ప్రక్రియను బలహీనపరిచే, విభేదాలను పెంచే ఏ అంశమైనా అది ఆందోళన కలిగించేదే’ అని చెప్పారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి అన్ని వైపులనుంచి ప్రయత్నాలు జరగాలనేదే మా ఆశ అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన తిరుగుబాటులో మయన్మార్‌ సైన్యం ఆ దేశ అధికారాలను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూచీతోసహా పలువురు నేతలను నిర్బంధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని