Pakistan: పాకిస్థాన్‌.. పీవోకేను ముందు ఖాళీ చెయ్యి..!

ఐరాస భద్రతా మండలిలో భారత్‌ మరోసారి పాకిస్థాన్‌ వాదనను తిప్పికొట్టింది. కశ్మీర్‌ విషయంపై భారత్‌ మాట్లాడుతూ.. తొలుత పాక్‌ దళాలు ఆక్రమిత కశ్మీర్‌ను ఖాళీ చేయాలని డిమాండ్‌ చేసింది.

Updated : 17 Nov 2021 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐరాస భద్రతా మండలిలో భారత్‌ మరోసారి పాకిస్థాన్‌ వాదనను తిప్పికొట్టింది. కశ్మీర్‌ విషయంపై భారత ప్రతినిధి మాట్లాడుతూ.. తొలుత పాక్‌ దళాలు ఆక్రమిత కశ్మీర్‌ను ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘పాక్‌ చేసిన హాస్యాస్పద ఆరోపణలపై స్పందించేందుకు మరోసారి మీ ముందుకు రావాల్సి వచ్చింది. నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకొన్నాను. జమ్ము-కశ్మీర్‌, లద్దాఖ్‌లో పూర్తి భూభాగం భారత్‌ అంతర్భాగం. వీటిల్లో పాక్‌ ఆక్రమిత భూభాగాలు కూడా ఉన్నాయి. పాక్‌ అక్రమంగా చొరబడిన భూభాగాల నుంచి వైదొలగాలని మేం కోరుతున్నాం’’ అని ఐరాసలోని భారత శాశ్వత మిషిన్‌లోని కౌన్సిలర్‌ డాక్టర్‌ కాజల్‌ భట్‌ పేర్కొన్నారు.

‘‘భారత వ్యతిరేక ప్రచారానికి ఐరాస వేదికను దుర్వినియోగం చేస్తున్నారు. పాక్‌లో మైనార్టీలపై అత్యాచారాలకు పాల్పడుతూ స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులపై నుంచి దృష్టి మళ్లించేందుకు పాక్‌ ఇలా చేస్తోంది. ఆ దేశ ప్రభుత్వ పాలసీలో భాగంగా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, శిక్షణ, మద్దతు ఇస్తారన్న విషయం ప్రపంచం మొత్తం గమనించింది. ఐరాస నిషేధిత ఉగ్రవాదులు అత్యధికంగా ఆశ్రయం పొందుతున్న దేశంగా కూడా పాక్‌కు అప్రతిష్ఠ ఉంది. ఉగ్రవాదం, హింస కనుమరుగైనప్పుడే ఆ దేశంతో చర్చలు ఉంటాయి’’ అని స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని