Published : 08 Sep 2021 13:38 IST

India In UN: బుద్ధి మార్చుకోని పాక్‌.. చురకలంటించిన భారత్‌!

ఐరాస: భారత్‌పై విషం చిమ్ముతూ పాక్ అనేకసార్లు పరువు తీసుకుంది. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తూ.. ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలిచింది. పాక్‌ కుట్రలు, కుయుక్తుల్ని భారత్‌ ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చింది. అయినా, కుక్క తోక వంకర చందంగా దాయాది దేశం బుద్ధి మాత్రం మారడం లేదు. మరోసారి ఐరాస వంటి అత్యున్నత వేదికపై మాట్లాడే అవకాశాన్ని పాక్‌ దుర్వినియోగం చేసుకుంది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ నిర్మాణాత్మక సలహాలివ్వడంలో తన అసమర్థతను బయటపెట్టుకుంది. పాక్‌ విద్వేషపూరిత ప్రసంగాన్ని భారత్‌ దీటుగా తిప్పికొట్టింది. పాక్‌ సొంత దేశంతో పాటు సరిహద్దుల వెలుపలా ‘హింసా సంస్కృతి’ని ప్రేరేపిస్తోందని స్పష్టం చేసింది.

‘కరోనా అనంతర ప్రపంచంలో శాంతి సంస్కృతి పరివర్తన పాత్ర’ ఇతివృత్తంపై ఐరాస సాధారణ సభలో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాక్ ప్రతినిధి మునీర్ అక్రమ్ మాట్లాడుతూ.. కశ్మీర్‌ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. అలాగే ఇటీవల మరణించిన కశ్మీర్‌ వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ షా గిలానీ గురించి సైతం ప్రస్తావించారు. వీటిని ఐరాసలోని భారత శాశ్వత ప్రథమ రాయబారి విదిషా మైత్రి దీటుగా తిప్పికొట్టారు. భారత్‌పై విద్వేషం వెళ్లగక్కుతూ పాకిస్థాన్‌ ఐరాస వేదికను దుర్వినియోగం చేసిందని స్పష్టం చేశారు. సొంత దేశంతో పాటు సరిహద్దుల వెలుపలా ‘హింసా సంస్కృతి’ని ప్రేరేపిస్తోందని తేల్చి చెప్పారు. పాక్‌ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ‘శాంతి సంస్కృతి’ అనేది కేవలం సమావేశాల్లో చర్చించుకోవాల్సిన అంశం మాత్రమే కాదనన్నారు. ప్రపంచ దేశాల మధ్య సంబంధాల నిర్మాణంలో దీన్ని భాగం చేయాలని హితవు పలికారు.

మతాన్ని చూపి తమ దుశ్చర్యలను సమర్థించుకుంటున్న ఉగ్రవాదుల పట్ల ప్రపంచం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విదిషా మైత్రి తెలిపారు. మానవత్వం, ప్రజాస్వామ్యం, అహింసా వంటి విలువల్ని భారత్‌ వ్యాప్తి చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ‘శాంతి సంస్కృతి’కి ఆధారంగా నిలిచే ఈ అంశాలపై చర్చ సమయంలో ఐరాసలో ఎలాంటి పక్షపాత వైఖరికి తావివ్వొద్దని తేల్చి చెప్పారు. కరోనా విజృంభణలోనూ భారత్‌పై దుష్ప్రచారం కొనసాగిందని తెలిపారు.

భిన్నత్వంలో ఏకత్వానికి భారత్‌ కేంద్రంగా ఉందని విదిషా మైత్రి ఐరాసలో గుర్తుచేశారు. ‘సర్వ ధర్మ సంభవ్‌’ వంటి ప్రాచీన విలువల ఆధారంగానే భారత్‌ ముందుకు నడుస్తోందన్నారు. హిందూ, బౌద్ధం, సిక్కు, జైన మతాలకు పుట్టిల్లైన భారత్‌.. ఇస్లాం, క్రైస్తవ, పార్శీ మతాల బలోపేతానికి కేంద్రంగా నిలిచిందన్నారు. సహనంతో కూడిన సమ్మిళిత సమాజ నిర్మాణంలో శాంతి సంస్కృతి కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని