Published : 13 May 2022 02:34 IST

BrahMos: బ్రహ్మోస్‌ ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం.. సుఖోయ్‌ నుంచి తొలిసారి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి. బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి ఎక్స్‌టెండెడ్‌ రేంజ్ వెర్షన్‌ను గురువారం సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించారు. ‘సుఖోయ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి నిర్వహించిన క్షిపణి ప్రయోగం ప్రణాళికాబద్ధంగా సాగింది. బంగాళాఖాతం ప్రాంతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని అది నేరుగా తాకింది’ అని రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సుఖోయ్‌ నుంచి ఈ అధునాతన మిసైల్‌ను ప్రయోగించడం ఇదే మొదటిసారి. పైగా.. బ్రహ్మోస్‌ క్షిపణి అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ పరిధిని గతంలో ఉన్న 290 కి.మీల నుంచి ఈసారి 350కి.మీలకు విస్తరించడం విశేషం. భారత్‌, రష్యాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ ద్వారా ఈ సూపర్‌సోనిక్‌ క్రూజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి ధ్వని కంటే దాదాపు మూడు రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లగలవు.

బ్రహ్మోస్‌ విస్తరణ పరిధి సామర్థ్యం, సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానం శ్రేష్ఠమైన పనితీరు.. రెండు కలిసి భారత వైమానిక దళాని(ఐఏఎఫ్‌)కి ఒక వ్యూహాత్మక బలాన్ని అందించనున్నాయి. భవిష్యత్తులో యుద్ధక్షేత్రంలో ఆధిపత్యం చెలాయించడానికి వీలు కల్పిస్తున్నాయి. ‘తాజా ప్రయోగంతో వాయుసేన.. సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి సుదూర ప్రాంతాల్లోని భూతల, సముద్ర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యాన్ని సాధించింది’ అని రక్షణ శాఖ తెలిపింది. ఐఏఎఫ్‌తోపాటు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), నౌకాదళం, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌), బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(బీఏపీఎల్‌).. ఈ టెస్ట్‌ ఫైరింగ్‌లో భాగస్వాములయ్యాయని పేర్కొంది. గత నెలలో నౌకాదళం.. బ్రహ్మోస్ క్షిపణి యాంటీషిప్‌ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని