
BrahMos:‘బ్రహ్మోస్’ ప్రయోగం విజయవంతం.. వెల్లడించిన డీఆర్డీఓ
ఇంటర్నెట్ డెస్క్: మరిన్ని స్వదేశీ వ్యవస్థలతో మెరుగుపరిచిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి గురువారం విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడి చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) లాంచ్ ప్యాడ్- 3 నుంచి ఈ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు డీఆర్డీఓ తెలిపింది. మరింత మెరుగైన పనితీరుతోపాటు ఇందులోని అనేక కొత్త స్వదేశీ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ మిషన్ విజయవంతంగా ప్రదర్శించినట్లు ట్వీట్ చేసింది. ఇటీవలే డీఆర్డీఓ.. సముద్రం నుంచి సముద్రంలోకి ప్రయోగించగల అడ్వాన్స్డ్ సీ టు సీ వేరియంట్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ నుంచి విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.
తాజా ప్రయోగం విజయవంతంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ.. డీఆర్డీఓ, బ్రహ్మోస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. భారత్, రష్యాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ ద్వారా ఈ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి ధ్వని కంటే దాదాపు మూడు రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లగలవు. తాము తయారు చేస్తోన్న బ్రహ్మోస్‌తోపాటు ఇతర అధునాతన రక్షణ ఆయుధాలు ఇతర దేశాలపై దాడి చేసేందుకు కాదని, ఆ దేశాలు భారత్‌పై కన్నెత్తే సాహసం చేయకుండా ఉండేందుకేనని రాజ్‌నాథ్ ఇటీవల ఓ సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే.