Vaccines: ప్రపంచంలో వినియోగించే అన్ని టీకాల్లో.. 60శాతం భారత్‌వే..!

ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే అన్ని వ్యాక్సిన్లలో (Vaccines) దాదాపు 60శాతం భారత్‌లో ఉత్పత్తి చేసినవేనని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) పేర్కొన్నారు.

Published : 17 Aug 2022 18:43 IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే అన్ని వ్యాక్సిన్లలో (Vaccines) దాదాపు 60శాతం భారత్‌లో ఉత్పత్తి చేసినవేనని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచానికి వ్యాక్సిన్లను అందిస్తోన్న భారత్.. ఎన్నో వ్యాధులకు సంబంధించి వ్యాక్సిన్లను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. స్వదేశంలో లాక్‌డౌన్‌ సమయంలోనూ కరోనా వ్యాక్సిన్‌ను (Coronavaccine) తయారుచేసి అర్హుడైన ప్రతి పౌరుడికి రెండు డోసులు అందించిందన్నారు. కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తోన్న సజ్జన్‌ సింగ్‌ యాదవ్‌ అనే అధికారి రాసిన ‘ఇండియా వ్యాక్సిన్‌ గ్రోత్‌ స్టోరీ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆమె.. ప్రపంచానికి వ్యాక్సిన్‌ అందించడమనేది భారత్‌ డీఎన్‌ఏలోనే ఉందన్నారు.

‘ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచ దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌లను అందిస్తోంది. విశ్వవ్యాప్తంగా వినియోగిస్తోన్న అన్ని వ్యాక్సిన్‌లలో దాదాపు 60శాతం టీకాలు భారత్‌లోనే ఉత్పత్తి అవుతాయి. వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయడంతో పాటు సరఫరా చేసే విషయంలో యావత్‌ ప్రపంచానికి భారత్‌ ఒక్కటే చాలా సహకారం అందిస్తోంది’ అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కరోనా విజృంభణ వేళ.. నిర్ణీత సమయంలో దేశవ్యాప్తంగా 200 కోట్ల డోసులను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటివరకు మొత్తంగా 208.57 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను అందజేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రికాషన్‌ డోసును కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. రెండో డోసు తీసుకొని ఆరు నెలల వ్యవధి పూర్తైన వారందరూ మూడో డోసు తీసుకోవచ్చు. ఇప్పటివరకు అర్హుల్లో 17శాతం మంది మాత్రమే బూస్టర్‌ డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని