India: వైరస్‌ మూలాలపై దర్యాప్తు జరగాల్సిందే

చైనాలో కరోనా మూలాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని భారత్‌ డిమాండ్‌ చేసింది.

Updated : 29 May 2021 17:43 IST

దిల్లీ: చైనాలో కరోనా మూలాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని భారత్‌ డిమాండ్‌ చేసింది. చైనాలో వైరస్‌ ఎలా ఏర్పడిందన్న అంశంపై దర్యాప్తు జరపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తమ దేశ నిఘాసంస్థలను ఆదేశించడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా పుట్టుకకు సంబంధించిన వివరాలపై మరోసారి చర్చ మొదలైంది.  అమెరికాతో పాటు ఆస్ట్రేలియా కూడా వుహాన్‌లో కరోనా పుట్టుకపై విచారణ జరపాలని కోరింది. కరోనా వైరస్‌ వుహాన్‌ నగరంలోని జంతు విక్రయశాలల నుంచి వ్యాప్తి చెందిందని చైనా వాదిస్తోంది. అయితే  అదే నగరంలోని ఒక ప్రయోగశాల నుంచి బయటకు వచ్చిందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

డబ్ల్యుహెచ్‌వో విచారణ మొదటి అడుగు మాత్రమే

కొవిడ్‌-19కు సంబంధించి చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌వో) దర్యాప్తు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ విచారణ సాగనీయకుండా చైనా అధికార యంత్రాంగం పలు అడ్డంకులు సృష్టించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు విచారణను ప్రపంచ ఆరోగ్యసంస్థ పూర్తిచేసింది. కానీ నివేదికలో గబ్బిలాల నుంచి వైరస్‌ ప్రబలివుంటుందని వెల్లడించింది. అయితే ల్యాబ్‌లో నుంచి లీక్‌ అనేది వాస్తవదూరంగా ఉండవచ్చని పేర్కొంది. ఈ విచారణ మొదటి అడుగు మాత్రమేనని పూర్తిగా దర్యాప్తు జరిపితే అన్నీ అంశాలు వెలుగులోకి వస్తాయని భారత్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

గుర్తు తెలియని జంతువు నుంచి..

మధ్య చైనాలో ఉన్న వుహాన్‌లో 2019 డిసెంబరులో ఈ వైరస్‌ బయటపడింది.దీన్ని SARS-CoV-2 అని వ్యవహరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ సభ్యుల బృందంలోని ఒకరు దీనిపై మాట్లాడుతూ వుహాన్‌లో తమ పరిశోధనల్లో  గబ్బిలాల నుంచి ఒక జంతువుకు అనంతరం మానవులకు సోకి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఏ జంతువు నుంచి సోకిందో అంతుచిక్కడం లేదని చెప్పడం గమనార్హం. అయితే వుహాన్‌లో దర్యాప్తు మొదటి దశ మాత్రమేనని అనంతరం పలు దఫాలుగా విచారణ చేపట్టాలని ఆయన చెప్పడంతో చైనా మూలాలపై మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని