Chinese Apps: మరో 54 చైనా యాప్‌లపై భారత్‌ నిషేధం..?

భారత్‌, చైనా మధ్య లద్దాఖ్‌ ప్రతిష్టంభన కొనసాగుతోన్న వేళ ఆ దేశ కంపెనీలపై మరోసారి కొరడా ఝళిపించేందుకు భారత్‌ సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. దేశ భద్రత దృష్ట్యా

Updated : 14 Feb 2022 13:37 IST

దిల్లీ: భారత్‌, చైనా మధ్య లద్దాఖ్‌ ప్రతిష్టంభన కొనసాగుతోన్న వేళ ఆ దేశ యాప్‌లపై మరోసారి కొరడా ఝళిపించేందుకు భారత్‌ సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన మరో 54 యాప్‌లపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్యూటీ కెమెరా - సెల్ఫీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, వివా వీడియో ఎడిటర్‌, టెన్సెంట్‌ రివర్‌ , యాప్‌లాక్‌, డ్యుయల్‌ స్పేస్‌ లైట్‌ వంటి 54 యాప్‌లపై త్వరలోనే నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. సదరు యాప్‌లతో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

2020 ఏప్రిల్‌లో చైనా బలగాలు భారత్‌ భూభాగంలోకి అక్రమంగా చొరబడటంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 2020 జూన్‌ 15న గల్వాన్‌ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలతో పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. దీంతో రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలోనే చైనా కంపెనీలకు భారత ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందనే కారణాలతో 2020లో వందల సంఖ్యలో చైనా యాప్స్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.

గల్వాన్‌ ఘర్షణలు చోటుచేసుకున్న కొద్ది నెలలకే 2020 జులై నెలలో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. తర్వాత అదే ఏడాది సెప్టెంబరులో మరో 118 యాప్‌లు, నవంబరులో 43 చైనా యాప్‌లను నిషేధించింది. వీటిల్లో టిక్‌టాక్‌తో పాటు విచాట్‌, షేర్‌ఇట్‌, హలో, లైకీ, యూసీ బ్రౌజర్‌, పబ్‌జీ వంటి యాప్‌లున్నాయి. అయితే, అప్పట్లో ఈ వ్యవహారంపై డ్రాగన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ వాటిని పునరుద్ధరించే యోచన తమకు లేదని భారత్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని