Coal Crisis: బొగ్గు ఉత్పత్తికి ఊతం.. 100కుపైగా గనుల పునఃప్రారంభానికి చర్యలు!

దేశంలో బొగ్గు కొరతను అధిగమించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే 100కుపైగా మూతబడిన గనులను పునఃప్రారంభించడం ద్వారా.. వచ్చే రెండు, మూడేళ్లలో అదనంగా 75 నుంచి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని...

Published : 06 May 2022 15:28 IST

దిల్లీ: దేశంలో బొగ్గు కొరతను అధిగమించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే 100కుపైగా మూతబడిన గనులను పునఃప్రారంభించడం ద్వారా.. వచ్చే రెండు, మూడేళ్లలో అదనంగా 75 నుంచి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని భావిస్తున్నట్లు దేశ బొగ్గు శాఖ కార్యదర్శి ఏకే జైన్ శుక్రవారం తెలిపారు. పెద్దమొత్తంలో వేగంగా బొగ్గు సరఫరా దిశగా ఇదో సాహసోపేత అడుగు అని పేర్కొన్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న వేళ దేశవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో కరెంటు ఉత్పత్తిని పెంచేందుకు ఆయా రాష్ట్రాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, బొగ్గు కొరతతో.. విద్యుత్తు కోతలు తప్పడం లేదు! ముఖ్యంగా దిల్లీ, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులోనూ ఈ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు.. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు, దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్‌.. మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 777.2 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. స్థానికంగా దాదాపు బిలియన్ టన్నులకు పైగా వినియోగించింది. గత నెలలోనూ 66.1 మిలియన్‌ టన్నుల వరకు ఉత్పత్తి చేసింది. మరోవైపు దేశంలోని బొగ్గులో 80 శాతం ఉత్పత్తి చేసే ‘కోల్ ఇండియా’ సైతం.. 2024 నాటికి తన వార్షిక ఉత్పత్తిని 622.6 మిలియన్ టన్నుల నుంచి ఒక బిలియన్ టన్నులకు పెంచాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా.. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గును వేగంగా తరలించేందుకు వీలుగా రైల్వేశాఖ.. వెయ్యికిపైగా రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని