PM Modi: పదేళ్లలో దేశంలో రికార్డు స్థాయిలో వైద్యుల సంఖ్య: ప్రధాని మోదీ

ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాలను నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంతో.. రానున్న పదేళ్లలో దేశంలో వైద్యుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో నిర్మించిన 200 పడకల...

Published : 15 Apr 2022 13:38 IST

గాంధీనగర్‌: ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాలను నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంతో.. రానున్న పదేళ్లలో దేశంలో వైద్యుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో నిర్మించిన 200 పడకల కేకే పటేల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ‘ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి.. అందరికీ వైద్య విద్యను చేరువ చేయడం మా లక్ష్యం. ఫలితంగా.. భారత్‌లో పదేళ్లలో రికార్డు స్థాయిలో వైద్యులు తయారవుతారు’ అని అన్నారు.

‘వైద్య ఖర్చులు పేదలను ఇబ్బంది పెట్టనప్పుడే.. పేదరికం నుంచి బయటపడేందుకు వారు కృషి చేయగలుగుతారు. కొన్నేళ్లుగా ఆరోగ్య రంగంలో తాము అమలు చేసిన పథకాలు.. ఈ ఆలోచన నుంచే ప్రేరణ పొందాయ’ని మోదీ వ్యాఖ్యానించారు. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో కేవలం తొమ్మిది వైద్య కళాశాలలు ఉండేవని, అయితే గత 20 ఏళ్లలో స్థానికంగా వైద్య విద్యారంగం చాలా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఏయిమ్స్‌, 36కుపైగా పైగా వైద్య కళాశాలలు ఉన్నాయని చెప్పారు. రాజ్‌కోట్‌లోని ఎయిమ్స్‌ సైతం.. 2021 నుంచి 50 మంది విద్యార్థులను చేర్చుకుంటోంది’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని