Genome Sequencing: జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ విధానంలో మార్పులు! ఒమిక్రాన్‌ తీవ్రతను అంచనా వేసేందుకే..

కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా రోజువారీ కేసులు రెండు లక్షలు దాటాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో చేరికలూ పెరుగుతున్నాయి. ...

Published : 14 Jan 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా రోజువారీ కేసులు రెండు లక్షలు దాటాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో చేరికలూ పెరుగుతున్నాయి. అయితే.. కొవిడ్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారిలో ఒమిక్రాన్ బాధితులు ఎంతమందో తేల్చేందుకు వీలుగా ‘జీనోమ్ సీక్వెన్సింగ్’ విధానంలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వివరాల ప్రకారం.. ఇకనుంచి ఐసీయూల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులతోపాటు మరణించినవారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్స్‌ చేయాలని నిర్ణయించారు. దీంతో హాస్పిటళ్లలో చేరికలకు, మరణాలకు ఒమిక్రాన్‌ ఎంతవరకు కారణమవుతోంది? దాని తీవ్రత(సీవియారిటీ ఇండెక్స్‌) ఎంతో అంచనా వేసేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు.

ఈ క్రమంలోనే జీనోమ్‌ సీక్వెన్సింగ్ కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి నమూనాలు పంపాలని కేంద్రం.. అన్ని రాష్ట్రాలను ఆదేశించినట్లు సమాచారం. ఒమిక్రాన్ కేసులను లెక్కించే బదులు.. దాని ప్రబల్యాన్ని అధ్యయనం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. దీనికోసం వారంలోపు తగినంత సమాచారం సమకూరగలదని భావిస్తున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 5 శాతం నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతున్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో ఒమిక్రాన్ కేసులు అయిదు వేలు దాటిన విషయం తెలిసిందే. నిన్న కొత్తగా 620 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించగా.. మొత్తం కేసులు 5,488కి చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని