భారత్‌ నుంచి వచ్చేవారిపై అమెరికా ఆంక్షలు

భారత్‌లో కరోనా కేసులు పెరిగి పోతుండటంతో ముందుజాగ్రత్త చర్యగా అమెరికా ప్రభుత్వం విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ నేటి నుంచి అమల్లోకి వచ్చింది.

Updated : 04 May 2021 14:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో కరోనా కేసులు పెరిగి పోతుండటంతో ముందుజాగ్రత్త చర్యగా అమెరికా ప్రభుత్వం విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గత శుక్రవారం ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. మే 4వ తేదీ నుంచి భారత్‌ నుంచి అమెరికాకు రావడాన్ని నిషేధించారు. కొన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు, జర్నలిస్టులు, కొందరు వ్యక్తులకు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటన జారీ చేసింది. వ్యక్తిగత హోదాలో మినహాయింపు పొందిన వారిలో గ్రీన్‌ కార్డు హోల్డర్లు, భర్త అమెరికాలో ఉండగా.. ఇంకా పౌరసత్వం పొందని భార్యలు, వారి 21 ఏళ్లలోపు సంతానానికి మినహాయింపు ఇచ్చారు.

ఇక ఈ ట్రావెల్‌ బ్యాన్‌ ఎన్నాళ్లు అమల్లో ఉంటుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో మరోసారి అధ్యక్ష ప్రకటన వెలువడే వరకూ ఇది అమల్లో ఉంటుందని భావిస్తున్నారు. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సిఫార్సుల మేరకు బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకొన్నారు.  నిషేధ ప్రకటన సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారత్‌లో 1.83కోట్ల కేసులు నమోదయ్యాయి.. ఇవి మరింత వేగంగా పెరుగుతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.  ఈ ప్రకటన అనంతరం అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకన్‌ మాట్లాడుతూ కొన్ని వర్గాలకు మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని