Boris Johnson: నా భుజంలో ఉన్నది భారత్‌ టీకా : బ్రిటన్‌ ప్రధాని

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ చేస్తోన్న ప్రయత్నాలను బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రశంసించారు.

Updated : 22 Apr 2022 18:14 IST

నరేంద్ర మోదీతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ద్వైపాక్షిక చర్చలు

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ చేస్తోన్న ప్రయత్నాలను బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను కూడా భారత్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ తీసుకున్నానన్న ఆయన.. అది తనను సురక్షితంగా ఉంచుతోందన్నారు. ఈ విషయంలో భారత్‌కు ధన్యవాదాలు చెప్పిన జాన్సన్‌.. ప్రపంచ ఫార్మసీగా భారత్‌ ఎదుగుతోందని కొనియాడారు. భారత పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఆ వివరాలను మీడియాతో పంచుకున్న ఇరువురు నేతలు.. భారత్‌, బ్రిటన్‌ దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై కసరత్తు చేస్తున్నాయని చెప్పారు. వీటితోపాటు రక్షణ, భద్రతా రంగాల్లో పలు విషయాలపై అంగీకారానికి వచ్చినట్లు ఇద్దరు ప్రధానులు పేర్కొన్నారు.

స్వేచ్ఛా వాణిజ్యంపై ముందడుగు

‘వివిధ రంగాల్లో ఇరు దేశాల దృఢమైన సంబంధాల్లో భాగంగా 2030 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలపై సమీక్ష జరిపాం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. వీటిని ఈ ఏడాది చివరి నాటికి ముగించేందుకు కృషి చేయాలని నిర్ణయించాం. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోనూ స్వేచ్ఛాయుత, దాపరికం లేని, కలుపుకొనిపోయేతత్వంతో నిబంధనలకు లోబడి వాణిజ్యం చేసే ఆవశ్యకతను నొక్కిచెప్పాం. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన ప్రాముఖ్యతను ప్రధానంగా చర్చించాం. ఇదే సమయంలో శాంతియుత, సుస్థిర అఫ్గానిస్థాన్‌కు మా మద్దతు ఇస్తున్నాం’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

సచిన్‌, అమితాబ్‌లా అనిపించింది..

ద్వైపాక్షిక చర్చలపై మాట్లాడిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. ‘తాము అద్భుతమైన చర్చలు జరిపాం. ఇరుదేశాల సంబంధాలను ఇవి మరింత బలోపేతం చేస్తాయి. రక్షణ, భద్రతా రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యంలో పలు ఒప్పందాలు చేసుకున్నాం’ అని వివరించారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ‘గార్డ్‌ ఆఫ్ హానర్‌’ స్వీకరించిన బోరిస్‌ జాన్సన్‌.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌-బ్రిటన్‌ల స్నేహబంధం అత్యంత పురాతనమైనదన్నారు. గతంలో ఎన్నడూ లేనంత దృఢంగా ఇరు దేశాల సంబంధాలు ఉన్నాయన్న ఆయన.. తనకు భారత్‌లో లభించిన ఆదరణ ప్రపంచంలో ఇంకెక్కడా లభించలేదన్నారు. భారీ హోర్డింగులతో తనకు ఘన స్వాగతం పలికిన తీరు చూసి.. సచిన్‌ తెందుల్కర్‌, అమితాబ్‌ బచ్చన్‌లా అనిపించిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన బోరిస్.. మోదీ తనకు ప్రత్యేక మిత్రుడంటూ అభివర్ణించారు.

మోదీ నాకు ప్రత్యేక మిత్రుడు..

భారత్‌లో తమ సంబంధాలు ప్రతి మార్గంలోనూ బలోపేతమయ్యాయని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. మోదీని తనకు ప్రత్యేకమైన మిత్రుడిగా అభివర్ణించారు. తన భారత పర్యటన ఇరు దేశాల బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిందన్నారు. విస్తృత రక్షణ, భద్రతా భాగస్వామ్యానికి ఇరు దేశాలూ అంగీకరించాయని పేర్కొన్నారు. రక్షణ రంగంలో భారత్‌లో తయారీకి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతాన్ని స్వేచ్ఛయుతంగా ఉంచేందుకు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా బోరిస్‌ పిలుపునిచ్చారు. వివిధ రూపాల్లో ఎదురవుతున్న ముప్పును కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలన్నారు. వచ్చే వారంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభించనున్నట్టు బోరిస్‌ వెల్లడించారు. 

చర్చల సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత్‌, బ్రిటన్‌ మధ్య గతేడాది సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ దశాబ్దంలో రెండు దేశాల సంబంధాలకు ఓ దిశ చూపేందుకు ఓ గొప్ప మార్గసూచీ 2030ని కూడా ప్రారంభించాం. ఆ మార్గ సూచీ వృద్ధిపై శుక్రవారం నాటి భేటీలో సమీక్షించాం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల బృందాలు పనిచేస్తున్నాయి.  చర్చల్లో చక్కని పురోగతి ఉంటోంది. ఈ ఏడాది చివరి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తిచేసే దిశగా పూర్తి ప్రయత్నాలు చేయాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి’’ అన్నారు.

ఉక్రెయిన్‌లో మానవ సంక్షోభంపై మోదీ ఆందోళన: ష్రింగ్లా

ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధంతో రోజురోజుకీ పెరిగిపోతున్న మానవ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసినట్టు కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ ష్రింగ్లా తెలిపారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో చర్చల్లో ఉక్రెయిన్‌ అంశం ప్రస్తావనకు వచ్చిందనీ.. అక్కడి పరిస్థితులపై ఇరువురు నేతలూ ఆందోళన వ్యక్తంచేసినట్టు చెప్పారు. ఉక్రెయిన్‌లో హింసాకాండను తక్షణమే నిలిపివేయాలనీ.. ఇరు దేశాధినేతలు నేరుగా చర్చలు జరిపి శాంతిస్థాపనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ యుద్ధం త్వరగా పరిష్కారం కావాలని కోరుకున్నారు. అలాగే, ఇరుదేశాల మధ్య వాణిజ్యం, ఉద్యోగావకాశాలతో పాటు సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, అంతరిక్షం, ఇతర సాంకేతికపరమైన అంశాలపై చర్చించారు. ఈ ద్వైపాక్షిక చర్చల్లో ఇద్దరు ప్రధానులూ స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై కొనసాగుతున్న సంప్రదింపులపైనా చర్చలు జరిపారు. ఇంధనం, గ్రీన్‌ హైడ్రోజన్‌, వాణిజ్యం, రక్షణ రంగంలో పరస్పర సహకారానికి ఇరుదేశాలూ అంగీకారం తెలిపాయి’’ అని ష్రింగ్లా వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని