India-UK: భారత్‌-యూకే వాణిజ్య ఒప్పందం సరైన దిశలోనే..!

యూకేలో నివసించే భారతీయులను ఉద్దేశిస్తూ బ్రిటన్‌ మాజీ మంత్రి బ్రేవర్మన్‌ చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ ఒప్పందం సరైన దిశలో ఉందని భారత్‌ తాజాగా వెల్లడించింది.

Published : 20 Oct 2022 18:12 IST

దిల్లీ: యూకేలో నివసించిన భారతీయులను ఉద్దేశిస్తూ బ్రిటన్‌ మాజీ మంత్రి సుయెలా బ్రేవర్మన్‌ వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారానికి తీశాయి. దీంతో ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ ఒప్పందంపై చర్చలు సరైన దిశలోనే సాగుతున్నాయని భారత వాణిజ్య శాఖ కార్యదర్శి సునిల్‌ బర్త్వాల్‌ తాజాగా వెల్లడించారు.

‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో అనేక అంశాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరింది. ఇంకా కొన్నింటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. సరైన దిశలోనే ముందుకెళ్తున్నాం. అతిత్వరలోనే రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని సునిల్‌ మీడియాకు తెలిపారు.

ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వీలుగా ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’పై భారత్‌, యూకే ఈ ఏడాది ఆరంభంలో చర్చలు ప్రారంభించాయి. ఈ ఒప్పందం ప్రకారం.. రెండు దేశాలు గరిష్ఠ వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలను భారీగా తగ్గించడమే లేదా తొలగించడమో చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పెట్టుబడులను ప్రోత్సహించేలా నిబంధనలను సులభతరం చేయాలి.

ఈ ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతుండగా.. ఇటీవల బ్రేవర్మర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీసా పరిమితి దాటిన తర్వాత బ్రిటన్‌లో నివసించే వారిలో అత్యధికులు భారతీయులే అని అన్నారు. అంతేగాక,  భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఆందోళనలు ఉన్నాయన్నారు. దీనిపై భారత్‌ దీటుగా బదులిచ్చింది కూడా. అయితే అయితే బ్రేవర్మన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఎఫ్‌టీఏ ఒప్పందం డోలాయమానంలో పడిందని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ పరిణామాల తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగిన యూకే.. భారత్‌తో మరింత పటిష్ఠమైన వాణిజ్య సంబంధాలను కోరుకుంటున్నట్లు ప్రకటించింది. అటు బ్రేవర్మన్‌ కూడా ఇదే రకమైన వివరణ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని