IND-AUS: అలాంటి కార్యకలాపాలను అనుమతించొద్దు.. ఆస్ట్రేలియాకు భారత్‌ విజ్ఞప్తి

భారత దేశ సమగ్రత, భద్రత, జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేక కార్యకలాపాలను ఆస్ట్రేలియా భూభాగంపై అనుమతించవద్దని ఆ దేశాన్ని కోరింది. రాజకీయ ప్రేరేపిత అతివాద శక్తులు భారత్‌కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో తీర్మానం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. 

Published : 03 Feb 2023 01:16 IST

దిల్లీ: ఆస్ట్రేలియాలో భారతీయులపై ఖలీస్థాన్‌ మద్దతుదారులు దాడి చేయడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత దేశ సమగ్రత, భద్రత, జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేక కార్యకలాపాలను ఆస్ట్రేలియా భూభాగంపై అనుమతించవద్దని విదేశాంగ శాఖ కార్యదర్శి ఆరిందమ్‌ బాగ్చీ కోరారు. ఖలీస్థాన్‌కు మద్దతుగా సిక్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) అనే ఉగ్రవాద సంస్థ సోమవారం మెల్‌బోర్న్‌లో ప్రదర్శన చేపట్టింది. అదే సమయంలో భారత్‌కు అనుకూలంగా కొందరు జాతీయజెండాలతో ప్రదర్శన నిర్వహించారు.  ఈ సందర్భంగా ఖలీస్థాన్ మద్దతుదారులు భారతీయులపై దాడి చేశారు.  ఈ ఘటనలో ఇద్దరు భారతీయులకు గాయాలయ్యాయి.  ఖలీస్థాన్‌ రెఫరెండం పేరుతో కొన్ని రాజకీయ ప్రేరేపిత అతివాద శక్తులు భారత్‌కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో తీర్మానం చేయడంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 

‘‘భారతీయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులైన వారిని శిక్షించాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని కోరాం. నిషేధిత ఉగ్రవాద సంస్థలు చేపడుతున్న కార్యకలాపాలపై భారత్‌ ఆందోళనను ఆస్ట్రేలియా దృష్టికి తీసుకెళ్లాం. ఆస్ట్రేలియాలోని భారతీయుల భద్రత, వారి ఆస్తుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశాం. భారత దేశ సమగ్రత, భద్రత, జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన కార్యకలాపాలను ఆస్ట్రేలియా భూభాగంపై అనుమతించవద్దని ఆ దేశాన్ని కోరాం’’ అని ఆరిందమ్‌ బాగ్చీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్‌ వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులపై దాడి జరగడంపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని