Ukraine Crisis: యుద్ధంపై ఐసీజే తీర్పు.. రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారత న్యాయమూర్తి

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న దండయాత్రపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) నిన్న కీలక తీర్పు వెలువరించింది. తక్షణమే రష్యా దళాలు తమ దాడులను నిలిపవేయాలని

Updated : 17 Mar 2022 11:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న దండయాత్రపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) నిన్న కీలక తీర్పు వెలువరించింది. తక్షణమే రష్యా దళాలు తమ దాడులను నిలిపివేయాలని ఐసీజే ఆదేశించింది. మొత్తం 15 మంది న్యాయమూర్తులు ఉన్న ఈ కోర్టులో 13-2 మెజార్టీతో ఈ తీర్పు వెలువడింది. ఐసీజేలోని భారత న్యాయమూర్తి జస్టిస్‌ దల్వీర్‌ భండారి ఈ తీర్పును సమర్థిస్తూ రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. 

ఇతర అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ఈ యుద్ధం విషయంలో దూరంగా ఉంటోన్న సమయంలో ఐసీజేలో భారత న్యాయమూర్తి రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంతో పాటు ఐరాస భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాలపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 

జస్టిస్‌ దల్వీర్‌ భండారీ 2012లో తొలిసారిగా అంతర్జాతీయ న్యాయస్థానికి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2018లో పదవీకాలం ముగియగా.. మరోసారి కూడా భారత్‌ ఆయననే నామినేట్‌ చేసింది. దీంతో రెండోసారి ఆయన ఐసీజేలో కొనసాగుతున్నారు.

తీర్పును వ్యతిరేకించిన చైనా..

ఇదిలా ఉండగా.. రష్యాపై ఐసీజే ఇచ్చిన తీర్పును ఇద్దరు న్యామయూర్తులు వ్యతిరేకించారు. అందులో ఒకరు చైనా న్యాయమూర్తి కావడం గమనార్హం. చైనాకు చెందిన న్యాయమూర్తి సూ హన్కిన్‌, రష్యాకు చెందిన వైస్‌ ప్రెసిడెంట్‌ కిరిల్‌ జివోర్గియాన్‌ ఈ తీర్పును వ్యతిరేకించారు. 

డాన్‌బాస్‌ ప్రాంతంలో ఊచకోత జరిగిందన్న సాకుతో రష్యా తమ దేశంపై దాడి చేయడంపై రెండు వారాల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాడిని ఆపాలంటూ ఆదేశాలివ్వాల్సిందిగా అభ్యర్థించింది. ఇటీవల ఐసీజే దీనిపై విచారణ జరపగా.. రష్యా హాజరుకాలేదు. అయితే, ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి రాదని ఆ తర్వాత లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. దీనిపై బుధవారం మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం.. సైనికచర్యను తక్షణమే ఆపాలని ఆదేశించింది. దీన్ని రష్యా అమలుచేయకపోతే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి అంతర్జాతీయ న్యాయస్థానం నివేదిస్తుంది. మండలిలో రష్యాకు వీటో అధికారం ఉన్న నేపథ్యంలో తీర్పు అమలు ప్రశ్నార్థకమేనని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని