మనమెంత అన్నం పారేస్తున్నామో తెలుసా..!

931 మిలియన్ల టన్నులు.. ప్రపంచవ్యాప్తంగా 2019లో మనం చెత్తపాలు చేసిన ఆహారం లెక్క ఇది.

Updated : 06 Mar 2021 11:47 IST

దిల్లీ: 931 మిలియన్ల టన్నులు.. ప్రపంచవ్యాప్తంగా 2019లో మనం చెత్తపాలు చేసిన ఆహారం లెక్క ఇది. 40 టన్నుల బరువున్న 23 మిలియన్ల ట్రక్కులను పూర్తిగా నింపొచ్చు. ఆ మొత్తం ట్రక్కులతో ఈ భూమిని ఏడుసార్లు చుట్టి రావొచ్చు. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 17 శాతం చెత్తబుట్టలోకే పోతుంది.  ఈ మొత్తం వృథాలో భారత్ వాటా 68 మిలియన్ల టన్నుల పైమాటే.. ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహారం ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టేందుకు ఐక్యరాజ్య సమితి ఈ తీరుగా విశ్లేషించింది. ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్  2021’ పేరిట  యూఎన్‌ఈపీ నివేదిక తయారీలో ప్రధాన పాత్ర పోషించింది.

ఇళ్ల నుంచే ఆహారం ఎక్కువగా చెత్తబుట్టలోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. గృహాల నుంచి నుంచి 61 శాతం, ఆహార సేవల కారణంగా 26 శాతం, రిటైల్ అవుట్‌లెట్ల నుంచి 13 శాతం ఆహారపదార్థాలు వృథా అవుతున్నాయని ఆ నివేదిక లెక్కగట్టింది. భారత్‌లో తలసరిగా ఒక సంవత్సరంలో ఒక ఇంటి నుంచి 50 కేజీల ఆహారాన్ని చెత్త బుట్టలో వేస్తున్నారని అంచనా వేసింది. మొత్తంగా మన దేశంలో పారబోస్తున్న ఆహారపదార్థాలు 68 మిలియన్ల టన్నులకు పైబడ్డాయి. అది అమెరికాలో 59 కేజీలుగా ఉండగా.. చైనాలో 64 కేజీలుగా తేలింది. ఆదాయ స్థాయులతో సంబంధం లేకుండా ప్రతి దేశంలో ఆహారపదార్థాలు వృథా అవుతున్నాయని సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 

‘వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, కాలుష్యం, వృథా వంటి సమస్యలను పరిష్కరించాలనుకుంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న  ప్రభుత్వాలు, పౌరులు తమ వంతుగా ఆహార వృథాను తగ్గించాలి. ఈ వృథా వాతావరణపరంగా, సామాజికంగా, ఆర్థికంగా గణనీయమైన ప్రభావం చూపుతోంది. ప్రపంచ గ్రీన్‌హౌస్ ఉద్ఘారాలకు వినియోగం కాని ఆహారంతో సంబంధం ఉంది’ అని యూఎన్‌ఈపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండర్సన్ వ్యాఖ్యానించారు. ‘ఈ వృథాను తగ్గించడం ద్వారా గ్రీన్ హౌస్ ఉద్ఘారాలను తగ్గించవచ్చు. ప్రకృతి విధ్వంసం నెమ్మదిస్తుంది. ఆహార లభ్యత పెరిగి, ఆకలితో బాధపడేవారి సంఖ్య తగ్గుతుంది. ఆర్థిక మాంద్యం సమయంలో డబ్బు ఆదా అవుతుంది’ అంటూ ఆహారం సరిగా వినియోగించుకుంటే కలిగే ప్రయోజనాలను విశ్లేషించారు.  ఈ నివేదిక ప్రకారం..2019లో 690 మిలియన్ల మంది అన్నం లేక అలమటించారు. కొవిడ్-19 సమయంలో ఈ సంఖ్య మరింత పెరిగి ఉంటుందని, మూడు బిలియన్ల మంది పోషకాహారాన్ని పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వినియోగ దశలోనే ఆహారాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని