Drone Sector: దేశంలో లక్షమంది డ్రోన్‌ పైలట్లు అవసరం: జ్యోతిరాదిత్య సింధియా

దేశంలో డ్రోన్ సేవలకు డిమాండ్‌ను పెంచేందుకు మొత్తం 12 కేంద్ర శాఖలు ప్రయత్నిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో దేశంలో సుమారు లక్ష మంది డ్రోన్ పైలట్లు అవసరమమని...

Published : 11 May 2022 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో డ్రోన్ సేవలకు డిమాండ్‌ పెంచేందుకు మొత్తం 12 కేంద్ర శాఖలు ప్రయత్నిస్తున్నాయని పౌర విమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో దేశంలో సుమారు లక్ష మంది డ్రోన్ పైలట్లు అవసరమని వెల్లడించారు. 2030నాటికి గ్లోబల్ డ్రోన్ హబ్‌ దిశగా భారత్ వేగంగా ఎదుగుతోందన్నారు. నీతి ఆయోగ్‌ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. డ్రోన్ రంగాన్ని మూడు అంశాలపై ఆధారపడి ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.

‘మొదటిది.. డ్రోన్‌ పాలసీకి సంబంధించిన అంశం. దీన్ని ఇప్పటికే వేగంగా అమలు చేస్తున్నాం. రెండోది.. ఇన్సెంటివ్‌లను సృష్టించడం. ఈ క్రమంలోనే ప్రవేశపెట్టిన ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌ఐ) స్కీం.. డ్రోన్‌ తయారీ, సేవారంగాలకు సరికొత్త ప్రోత్సాహాన్ని ఇస్తోంది’ అని మంత్రి తెలిపారు. గత ఏడాది సెప్టెంబరులో పీఎల్‌ఐ స్కీంను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దేశీయంగా డ్రోన్‌లకు డిమాండ్‌ను సృష్టించడం మూడో అంశమని.. 12 మంత్రిత్వ శాఖలు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు.

12వ తరగతి పాసైన వారు రెండు మూడు నెలల శిక్షణతో డ్రోన్ పైలట్‌గా మారొచ్చని, దీనికి కళాశాల డిగ్రీలు అవసరం లేదని మంత్రి తెలిపారు. కొన్నేళ్లలో దేశంలో దాదాపు లక్ష మంది డ్రోన్ పైలట్లు అవసరం.. కాబట్టి ఇది యువతకు సువర్ణావకాశమని తెలిపారు. దేశంలో డ్రోన్ పరిశ్రమ 2026 నాటికి రూ.15 వేల కోట్ల వరకు టర్నోవర్‌ సాధిస్తుందని సింధియా గతంలో తెలిపారు. పీఎల్‌ఐ పథకం కోసం మొదటి బ్యాచ్ దరఖాస్తులను మార్చి 10న ఆహ్వానించగా.. ఏప్రిల్‌ 20న తుది జాబితా ప్రకటించారు. ఎల్‌బిట్‌, ఐడియాఫోర్జ్‌ టెక్నాలజీతోపాటు 12 ఇతర డ్రోన్ కంపెనీలు ఈ పథకానికి ఎంపికయ్యాయి. ఈ క్రమంలోనే పౌర విమానయాన శాఖ మే 5న రెండో విడత దరఖాస్తులను ఆహ్వానించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని