LAC: చైనా ఏకపక్ష యత్నాలకు భారత్‌ అడ్డుకట్ట..!

వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ పరిస్థితిని మార్చేందుకు చైనా చేసే ఏకపక్ష యత్నాలను భారత్‌ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని

Published : 19 Jun 2022 15:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ పరిస్థితిని మార్చేందుకు చైనా చేసే ఏకపక్ష యత్నాలను భారత్‌ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని విదేశంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టం చేశారు. భారత్‌ భారీ స్థాయిలో దళాలను తరలించి వాస్తవాధీన రేఖవద్ద చైనాను కట్టడి చేసిందన్నారు.  తూర్పు లద్ధాఖ్‌ వివాదంపై ఆయన  ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 1993, 1996 నాటి ఒప్పందాలను చైనా ఉల్లంఘిచి వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చాలని యత్నించిందన్నారు. ‘‘మనం కొవిడ్‌ సమయంలో కూడా భారీగా దళాలను సరిహద్దులకు తరలించాము. ఈ విషయం దేశంలోని ప్రజలు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు గుర్తించాలి. మనం వాస్తవాధీన రేఖ వద్ద చైనాను కట్టడి చేయగలము. చైనా దళాలు వాస్తవాధీన రేఖకు సమీపంలో మోహరించాయి. దీంతో భారత్‌ కూడా మోహరించింది. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితుల్లోనే గల్వాన్‌ ఘటన చోటు చేసుకొంది. నాటి నుంచి ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాలపై చర్చలు జరుపుతున్నాం. వీటిల్లో చాలా వాటికి పరిష్కారం లభించింది. ఇది చాలా కష్టమైన పని. ఓపిక అవసరం. ఏకపక్షంగా చైనా వాస్తవాధీన రేఖ వద్ద చేపట్టే మార్పులను అంగీకరించమన్న వాటిపై స్పష్టత అవసరం. ఎంత కాలమైనా.. ఎన్ని విడతల చర్చలు జరిగినా.. ఎంత కఠినమైన బేరసారాలు జరిగినా.. మేము మాత్రం స్పష్టంగా ఉన్నాం’’ అని జైశంకర్‌ వ్యాఖ్యానించారు. చైనా చర్చలు ఇంకా ముగింపు దశకు రాలేదన్నారు.

చైనా విషయంలో భారత్‌ వైఖరిని గత గురువారం ది దిల్లీ డైలాగ్‌ సదస్సులో కూడా జైశంకర్‌ స్పష్టం చేశారు. అప్పట్లో ఆయన మాట్లాడుతూ భారత్‌-చైనా సంబంధాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకొనే గౌరవం ఆధారంగా ఉంటాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో పరిస్థితే భారత్‌-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కూడా ప్రతిబింబిస్తుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని