Omicron: భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు మరింత పెరుగుతాయ్‌, కానీ..

భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు మరింత పెరిగే అవకాశముందని, పాజిటివిటీ రేటు కూడా అధికంగా ఉంటుందని అన్నారు దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఏంజెలినా కాట్జీ.

Published : 25 Dec 2021 17:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు మరింత పెరిగే అవకాశముందని, పాజిటివిటీ రేటు కూడా అధికంగా ఉంటుందని అన్నారు దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఏంజెలినా కాట్జీ. అయితే వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉండే అవకాశముందని అన్నారు. భారత్‌లో ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు.. ఒమిక్రాన్‌ తీవ్రతను కచ్చితంగా అడ్డుకుంటాయని అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ తొలిసారిగా బయటపడింది దక్షిణాఫ్రికాలోనే. ఈ వేరియంట్‌ను గుర్తించిన నిపుణుల్లో కాట్జీ కూడా ఒకరు. తాజాగా ఆమె పీటీఐ వార్తా సంస్థకు ఫోన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘కొవిడ్‌ మహమ్మారి ఇంకా ముగియలేదు. ఒమిక్రాన్‌తో ఈ మహమ్మారి అంతమవుతుందని కొందరు చెబుతున్నారు. కానీ అలా నమ్మడం కష్టం. అయితే రానున్న రోజుల్లో ఇది ఎండమిక్‌ స్థాయికి తగ్గొచ్చు. ఇక భారత్‌ విషయానికొస్తే.. ఒమిక్రాన్‌ కేసులు మరింత పెరిగే అవకాశముంది. పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగా ఉండొచ్చు. అయితే సానుకూలాంశం ఏంటంటే.. దక్షిణాఫ్రికాలాగే భారత్‌లోనూ ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ తీవ్రతను తగ్గించడంలో సాయపడతాయి. టీకాలు వేసుకున్నవారికి, గతంతో కొవిడ్‌ బారిన పడినవారికి ఒమిక్రాన్‌ ముప్పు తక్కువే. కానీ టీకాలు తీసుకోని వారికి మాత్రం 100శాతం ముప్పు పొంచి ఉంది’’ అని ఆమె అన్నారు. 

ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. దీని వల్ల ఆసుపత్రిలో చేరికలు మాత్రం తక్కువగానే ఉంటున్నాయని కాట్జీ తెలిపారు. ఈ వేరియంట్‌ ముఖ్యంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారిలోనే ఎక్కువగా బయటపడుతోందని తెలిపారు. అంతేగాక, చిన్నారులకు కూడా సోకే ప్రమాదం ఉందని, అయితే వారు ఐదు-ఆరు రోజుల్లోనే కోలుకుంటున్నారని చెప్పారు. అయితే ఒమిక్రాన్‌ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్లతో పాటు మనం పాటించే కరోనా నివారణ మార్గదర్శకాలు చాలా ముఖ్యమని కాట్జే అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా వ్యవహరించాలని, మాస్క్‌లు, భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని