6G Technology: మోదీ కోరికను నెరవేరుస్తాం..6జీ లో భారత్‌దే హవా: అశ్వినీ వైష్ణవ్‌

రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానున్న ‘6జీ టెక్నాలజీ’ సేవల్లో ప్రపంచదేశాల కంటే భారత్‌ ముందుంటుందని టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. దిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 02 Oct 2022 22:32 IST

దిల్లీ: దిల్లీలోని ప్రగతి మైదానంలో శనివారం నిర్వహించిన 6వ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో ‘5జీ టెక్నాలజీ’ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానున్న ‘6జీ టెక్నాలజీ’ సేవల్లో ప్రపంచదేశాల కంటే భారత్‌ ముందుంటుందని టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. దిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘ మోదీ కోరిక మేరకు 6జీ సేవల్లో భారత్‌ కచ్చితంగా ముందుంటుంది’ అని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన స్మార్ట్‌ ఇండియా హాక్‌థాన్‌ గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ దశాబ్దం చివరి నాటికి దేశంలో 6జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

తాజాగా అందుబాటులోకి వచ్చిన 5జీ సేవలు వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్‌ అందించడమే కాకుండా విపత్తు ప్రతిస్పందన , వ్యవసాయం తదితర రంగాల్లో కీలకంగా పని చేయనున్నాయి. శనివారం జరిగిన 6వ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ, ఎయిర్‌టెల్‌ అధిపతి సునీల్‌ మిత్తల్‌, వొడాఫోన్‌ ఐడియా అధినేత కుమార మంగళం బిర్లా తదితర పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. డిసెంబరు 2023 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు అత్యంత నాణ్యతతో కూడిన, సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉండేలా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖేశ్‌ అంబానీ ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిత్తల్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని