Tejas aircraft: తొలిసారి తేజస్‌ యుద్ధవిమానాలు ఒకే క్రమంలో వెళ్లే దృశ్యాన్ని చూశారా?

 మొదటిసారిగా 14 తేజస్ యుద్ధ విమానాలు ఓ నిర్దిష్ట క్రమంలో వెళ్లేలా ఏర్పాటు చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని సూలూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ యుద్ధ విమానాలు బయలుదేరాయి.

Published : 16 Oct 2021 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాలిలో పక్షులు ఒకే క్రమంలో వెళ్తుంటేనే తదేకంగా చూస్తుంటాం. అలాంటిది యుద్ధవిమానాలు ఎగురుతుంటే.. చూపు తిప్పుకోగలమా! తాజాగా భారత వాయుసేన(ఐఏఎఫ్‌) మొదటిసారిగా 14 తేజస్ యుద్ధ విమానాలు ఓ నిర్దిష్ట క్రమంలో వెళ్లేలా ఏర్పాటు చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఈ ఫొటోలను ఐఏఎఫ్ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారాయి.

విమానాలను నడపడానికి ముందు ఒకే క్రమంలో వెళ్తున్న భారత వైమానిక దళ పైలట్స్‌

తేజస్‌ యుద్ధ విమానాల ప్రత్యేకతలు ఇవే..

* భారత్‌ తయారు చేసి, అభివృద్ధి చేసిన యుద్ధ విమానాల్లో తేజస్‌ ఒకటి. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్).. ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(డిఏఎల్‌)తో అనుసంధానమై వీటిని రూపొందించాయి. ముఖ్యంగా భారత వైమానిక దళం, భారత నావికాదళాలు వీటిని ఉపయోగిస్తాయి. 1980ల్లో మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సిఎ) కార్యక్రమం నుంచి రూపుదిద్దుకున్న విమానమే ‘తేజస్’. 2003లో, ఈ యుద్ధవిమానానికి అధికారికంగా ‘తేజస్’ అని పేరు పెట్టారు.

హెచ్‌ఏఎల్ HF-24 మారుత్ తరువాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అభివృద్ధి చేసిన రెండో సూపర్‌సోనిక్ ఫైటర్ విమానమే తేజస్. భారత వాయుసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా రూ.48వేల కోట్లతో 83 తేజస్‌ (ఎల్‌సీఏ - లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు ఈ ఏడాది జనవరిలో ఆమోద ముద్రవేసింది. కాగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు తీసుకున్న నిర్ణయం దేశ రక్షణ రంగం స్వయం సమృద్ధికి దోహదం చేస్తాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇకపై తేజస్‌దే హవా.. ఎందుకంటే

రాబోయే ఎల్‌సీఏ తేజస్‌ ఫైటర్‌ జెట్‌లు పటిష్టం చేసేందుకు భారత వాయుసేన కృషి చేస్తోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయమే ఇందుకు కారణం. మొత్తం జెట్‌లలో 73 తేజస్‌ ఎంకే-1ఏ ఫైటర్‌ జెట్‌లు, 10 తేజస్‌ ఎంకే-1ఏ శిక్షణా జెట్‌లు. ఈ జెట్‌లలో పెద్ద సంఖ్యలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని