Skin Bank: సైన్యంలో ‘స్కిన్‌ బ్యాంకు’!

భారత సైన్యం తొలిసారిగా ‘చర్మనిధి కేంద్రా’ (స్కిన్‌ బ్యాంకు)న్ని ప్రారంభించింది. ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 19 Jun 2024 05:59 IST

కాలిన గాయాలకు చికిత్స కోసమే.. 
తొలిసారి అందుబాటులోకి 

దిల్లీ: భారత సైన్యం తొలిసారిగా ‘చర్మనిధి కేంద్రా’ (స్కిన్‌ బ్యాంకు)న్ని ప్రారంభించింది. ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌ (పరిశోధన, రెఫరల్‌)లో ఈ స్కిన్‌ బ్యాంకును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌ సర్జన్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు సహా అత్యున్నత స్థాయి వైద్య బృందం ఇక్కడ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. చర్మ సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీకి ఈ స్కిన్‌ బ్యాంకు హబ్‌గా పనిచేస్తుందని, అవసరమైన సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్న సైనిక వైద్య కేంద్రాలకు చేరవేస్తుందని వెల్లడించారు.

సాయుధ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల సైన్యం నిబద్ధతకు స్కిన్‌ బ్యాంకు ఓ నిదర్శనమని సైనిక ఉన్నతాధికారులు పేర్కొన్నారు. చర్మం విషయంలో ప్రత్యేకంగా కేంద్రాన్ని కలిగి ఉండటం ద్వారా రోగులకు అత్యంత అధునాతన చికిత్స అందించగలమని ఆర్మీ హాస్పిటల్‌ కమాండెంట్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అజిత్‌ నీలకంఠన్‌ తెలిపారు.

ఏంటీ స్కిన్‌ బ్యాంకు?

కాలిన గాయాలు, గ్రహణం మొర్రి, తెగిన చేతులు, వేళ్లు అతికించడం.. ఇతరత్రా చికిత్సలకు చర్మం అవసరం అవుతుంది. రోగి శరీరంలోని కాళ్లు, చేతులు, తొడలు తదితర భాగాల నుంచి చర్మం సేకరించి గ్రాఫ్టింగ్‌ ద్వారా గాయాలైన చోట అమర్చుతున్నారు. అయితే.. రోగి శరీరం నుంచి 15-20 శాతం మాత్రమే ఇలా సేకరించడానికి వీలవుతుంది. అంతకంటే ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు అందుబాటులో ఉండటం లేదు. ఈ ఇబ్బందిని అధిగమించే ఉద్దేశంతో స్కిన్‌ బ్యాంకును ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని