Ladakh: ఆ వార్తలను కొట్టిపారేసిన సైన్యం

తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మాక ప్రాంతాల నుంచి భారత్, చైనా బలగాలు ఫిబ్రవరిలో వైదొలిగిన తర్వాత మళ్లీ ఆ ప్రదేశాలను ఆక్రమించేందుకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది....

Published : 14 Jul 2021 17:39 IST

శ్రీనగర్‌: తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మాక ప్రాంతాల నుంచి భారత్, చైనా బలగాలు ఫిబ్రవరిలో వైదొలిగిన తర్వాత మళ్లీ ఆ ప్రదేశాలను ఆక్రమించేందుకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల వాస్తవాధీన రేఖ దాటి తూర్పు లద్దాఖ్‌లోని అనేక ప్రాంతాలను చైనా సైన్యం ఆక్రమించి, ఆర్మీతో ఘర్షణకు దిగిందనే వార్తలను భారత సైన్యం తోసిపుచ్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇరువైపుల నుంచి ఆక్రమించే ప్రయత్నాలు జరగలేదని స్పష్టంచేసింది. గల్వాన్ సహా ఇతర ప్రాంతాల్లోనూ రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ తలెత్తలేదని చెప్పింది. ఇరు పక్షాలు చర్చల ద్వారా మిగిలిన అంశాలను పరిష్కరించుకోనున్నట్లు వివరించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు స్పష్టంచేసింది. 

గల్వాన్ ప్రతిష్ఠంభన నేపథ్యంలో అనేక విడతల చర్చల తర్వాత పాంగ్యాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి బలగాలను ఫిబ్రవరిలో భారత్, చైనా ఉపసంహరించుకున్నాయి. మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చర్చలు ముందుకు సాగడం లేదు. అయితే తూర్పు లద్ధాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్‌, గోగ్రా, దెమ్‌చోక్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకోవడానికి డ్రాగన్‌ నిరాకరిస్తూ.. వాస్తవాధీనరేఖ వెంబడి మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రహదారులు, సైనిక బలగాల వసతి సౌకర్యాలు, హెలిప్యాడ్లను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

ఈ నెల 6న చైనా సైన్యం లద్దాఖ్‌లోని దెమ్‌చుక్‌ ప్రాంతంలోకి వచ్చి బ్యానర్లు, జెండాలతో నిరసన తెలిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడి భారతీయులు దలైలామా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై వారు నిరసన తెలిపినట్టు సమాచారం. దలైలామా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న ప్రదేశానికి చైనా సైనికాధికారులు సహా కొందరు పౌరులు అయిదు వాహనాల్లో వచ్చారు. సింధు నదికి అవతలి ఒడ్డున నిలిచి చైనాకు సంబంధించిన బ్యానర్లు, జెండాలు చూపుతూ తమ నిరసన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు