
Afghanistan: కాబుల్‌లో భారత వ్యాపారి కిడ్నాప్.. తాలిబన్ల పనేనా?
కాబుల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో భారత్‌కు చెందిన ఓ వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మంగళవారం ఉదయం బన్సరీలాల్ అరెందేను కొందరు ఆగంతకులు తుపాకులతో బెదిరించి అపహరించినట్లు ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ తెలిపారు. పునీత్ తెలిపిన వివరాల ప్రకారం..
50ఏళ్ల బన్సరీ లాల్ కాబుల్‌లో ఫార్మా ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన తన సిబ్బందితో కలిసి కారులో తన దుకాణానికి వెళ్తుండగా.. వెనుకవైపు నుంచి ఓ వాహనం ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనం నుంచి దిగిన కొందరు తుపాకులతో బెదిరించి బన్సరీలాల్, ఆయన సిబ్బందిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. అయితే కిడ్నాపర్ల నుంచి బన్సరీలాల్ సిబ్బంది తప్పించుకోగా.. ఆయన మాత్రం వారివద్దే బందీగా ఉన్నట్లు తెలిపారు. తాలిబన్లే ఆయనను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
దీనిపై భారత విదేశాంగ శాఖకు సమాచారమిచ్చామని పునీత్ వెల్లడించారు. అటు భారత విదేశాంగ శాఖ కూడా దీనిపై స్పందించింది. బన్సరీ లాల్ కిడ్నాప్‌పై మరింత సమాచారం, నిజానిజాలు తెలుసుకుంటున్నామని, ఆయనను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. బన్సరీ లాల్ కుటుంబం దిల్లీ సమీపంలోని ఫిరోజాబాద్‌లో నివాసముంటోంది. వ్యాపారం నిమిత్తం ఆయన అఫ్గాన్ వెళ్లారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.