ఏడాదిన్నరగా జర్మనీ కస్టడీలోనే.. మోదీజీ మా బిడ్డను ఇప్పించండి..!
పరాయి దేశంలో కన్నబిడ్డకు దూరమైన ఓ భారత దంపతుల కన్నీటి గాథ ఇది..! చిన్నారికి అయిన ఓ గాయం ఆ పసికందును తల్లిదండ్రులకు దూరం చేసింది. బిడ్డ కోసం ఏడాదిన్నరగా ఆ జంట చేస్తోన్న న్యాయపోరాటం ఫలించకపోవడంతో.. ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని కొంగుచాచి వేడుకుంటోంది.
ముంబయి: బతుకుదెరువు కోసం సొంత ఊరిని వదిలి విదేశాలకు వెళ్లిన ఓ దంపతులకు (Indian Couple) ఊహించని కష్టం ఎదురైంది. లైంగిక వేధింపుల అనుమానాలతో వారి చిన్నారిని జర్మనీ ప్రభుత్వం లాగేసుకుంది. ప్రస్తుతం మూడేళ్ల వయసున్న ఆ పాప ఏడాదిన్నరగా జర్మనీ (Germany) అధికారుల కస్టడీలోనే ఉంది. దీంతో కన్నబిడ్డ కోసం నిరంతరంగా పోరాడుతున్న ఆ తల్లిదండ్రులు.. ఇప్పుడు స్వదేశానికి తిరిగొచ్చి భారత ప్రభుత్వం నుంచి సాయం అర్థిస్తున్నారు. తమ బిడ్డను ఇప్పించాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi), కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar)ను వేడుకుంటున్నారు.
ఇదీ జరిగింది..
గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ దంపతులు (Indian Couple) 2018లో ఉపాధి నిమిత్తం బెర్లిన్ వెళ్లారు. అక్కడ వారికి ఓ ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు నెలల వయసున్నప్పుడు ఆడుకుంటూ కింద పడిపోవడంతో ఆమె వ్యక్తిగత అవయవం వద్ద గాయమైంది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం బానే ఉందంటూ ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. పాపను చెకప్‌కు తీసుకురావాలని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు వెళ్లారు. అయితే, అప్పటికే అక్కడి వైద్యులు శిశు సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చారు. వారు ఆసుపత్రికి వచ్చి ఆ పాపను తల్లి ఒడి నుంచి తీసుకున్నారు. జర్మనీలో పుట్టిన ఆ పాప సంరక్షణ తమదేనని, చిన్నారిని ఇవ్వబోమని తేల్చిచెప్పారు. చిన్నారికి అయిన గాయం తీరు కారణంగా ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయన్న అనుమానాలతో ఆ పాపను అధికారులు కస్టడీలోకి తీసుకున్నట్లు ఆ తర్వాత తెలిసింది. అప్పటికి ఆ చిన్నారి వయసు ఏడాదిన్నర.
ఏడాదిన్నరగా కోర్టుల చుట్టూ తిరుగుతూ..
దీంతో ఆ తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదు. ఇప్పుడు మూడేళ్ల వయసున్న ఆ పాప.. ఏడాదిన్నరగా జర్మనీ అధికారుల కస్టడీలోనే ఉంది. విదేశంలో న్యాయం జరగకపోవడంతో ఆ తల్లిదండ్రులు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. ముంబయిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘ఈ కేసులో మేం డీఎన్‌ఏ నమూనాలు కూడా ఇచ్చాం. పోలీసు దర్యాప్తు, మెడికల్ రిపోర్టులు అన్నీ పూర్తయ్యాయి. 2022 ఫిబ్రవరిలోనే లైంగిక వేధింపుల కేసు మూసేశారు. అంతేగాక, పాపపై లైంగిక వేధింపుల అనుమానాలను 2021 డిసెంబరులోనే ఆ ఆసుపత్రి కొట్టిపారేసింది. అవన్నీ తీసుకుని మేం జర్మనీ ఛైల్డ్ సర్వీసెస్ అధికారుల దగ్గరకు వెళ్లాం. కానీ, వారు మాపైనే తిరిగి కేసు పెట్టారు. దానిపై మేం కోర్టుకు వెళ్లాం. అక్కడ తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచే మా సమర్థతను నిరూపించుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ పరీక్షల్లో సైకాలజిస్టు కేవలం 12 గంటలే మాతో మాట్లాడి మాకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చాడు’’ అని ఆ పాప తండ్రి వాపోయాడు.
పాపను భారత్‌కు పంపించేందుకు కూడా అక్కడి అధికారులు అంగీకరించట్లేదట. పాపను నెలకోసారి గంటపాటు కలిసేందుకు మాత్రమే తమను అనుమతిస్తున్నారని చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాము కోర్టుకు వెళ్లామని, నెలకు రెండు సార్లు పాపను చూసేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చినా.. అధికారులు ఆ ఆదేశాలను పాటించలేదని ఆరోపించారు. ‘‘నేరస్థులను కూడా వారి కుటుంబసభ్యులు కలిసేందుకు అనుమతి కల్పిస్తారు. కానీ మా బిడ్డను క్రిమినల్ కంటే దారుణంగా చూస్తున్నారు. ఆ దేశంలో మాకు న్యాయం జరగట్లేదు. ఈ విషయంలో మాకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రధాని మోదీ జోక్యం చేసుకుంటే అది సాధ్యమవుతుంది’’ అని చిన్నారి తల్లిదండ్రులు వేడుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: అదేం ఫీల్డింగ్.. రోహిత్ కెప్టెన్సీపై దాదా విసుర్లు!
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?
-
Politics News
Jagan-Chandrababu: నంబూరుకు జగన్.. చంద్రబాబు పర్యటనపై సందిగ్ధత
-
Politics News
KTR: విద్యార్థులు నైపుణ్యాలు అలవరుచుకుంటే ఉద్యోగాలు అవే వస్తాయి: కేటీఆర్
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత.. ‘ఏఐ’ ఏం చెప్పిందంటే..?
-
World News
Worlds Deepest Hotel: అత్యంత లోతులో హోటల్.. ప్రయాణం కూడా సాహసమే!