Ukraine Crisis: ‘అవి నా పిల్లలు’..పెంపుడు జాగ్వార్‌, పాంథర్‌ను వదిలేసి రాలేనన్న ఏపీ వాసి

ఓ ఆంధ్రప్రదేశ్‌ వాసి తన పెంపుడు జంతువులను వదిలేసి ఉక్రెయిన్‌ నుంచి రాలేనంటున్నాడు.......

Published : 08 Mar 2022 01:19 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడుల నేపథ్యంలో భారతీయులంతా స్వదేశానికి చేరుకుంటున్నారు. అక్కడి పరిస్థితులు రోజురోజుకు అధ్వానంగా మారుతున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌ వాసి మాత్రం తన పెంపుడు జంతువులను వదిలేసి రాలేనంటున్నాడు. ఇంతకీ అతడు పెంచుకుంటున్న జంతువులు ఏంటి అనుకుంటున్నారా..? జాగ్వార్‌, బ్లాక్‌ పాంథర్‌. వీటితోపాటు మరో నాలుగు కుక్కలు కూడా. వాటిని తన పిల్లలుగా పేర్కొంటూ.. తన ప్రాణాలు కాపాడుకునేందుకు వాటి జీవితాలను అగాథంలో పడేయలేనని తేల్చి చెబుతున్నాడు. ప్రస్తుతం ఓ బంకర్‌లో భయంభయంగా గడుపుతున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన గిరికుమార్‌ పాటిల్‌ మెడిసిన్‌ చదివేందుకు 2007లో ఉక్రెయిన్‌లోని సెవెరోడొనెట్క్స్‌ నగరానికి వెళ్లాడు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డాడు. ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌గా పనిచేస్తున్నాడు. అయితే జంతువులంటే అమితంగా ఇష్టపడే గిరికుమార్‌.. 20 నెలల క్రితం ఓ జూలో గాయపడిన జాగ్వార్‌ను అధికారుల అనుమతితో దత్తత తీసుకున్నాడు. దానికి ‘యాశా’ అని పేరు పెట్టి ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. యాశాకి తోడు కోసం ఆరు నెలల క్రితం ఓ బ్లాక్‌ పాంథర్‌ను ఇంటికి తీసుకొచ్చి పెంచుతున్నాడు. మరో నాలుగు కుక్కలను కూడా సాకుతున్నాడు.

ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలవడంతో తన ఇంటి కింద ఉన్న బేస్‌మెంట్‌లోనే ప్రస్తుతం కాలం గడుపుతున్నాడు. జంతువులకు ఆహారం తీసుకొచ్చేందుకు మాత్రమే నుంచి బయటకు వస్తున్నాడు. అయితే తిరిగి ఇంటికి రావాలని ఏపీలోని కుటుంబీకులు వేడుకుంటున్నా.. పెంపుడు జంతువులను వదిలేసి రాలేకపోతున్నాడు. ‘నా కుటుంబం నన్ను తిరిగి రావాలని కోరుతోంది. కానీ నా ప్రాణాలు కాపాడుకోవడానికి నా పెంపుడు జంతువులను అపాయంలో పడేయలేను. అవి నా పిల్లలు. నా చివరి శ్వాస వరకు నేను వాటితోనే ఉంటా. వాటిని రక్షిస్తా’ అని న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే వార్తా సంస్థకు గిరికుమార్‌ తెలిపాడు.

‘చుట్టుపక్కల బాంబుల మోత మోగుతోంది. నా జంతువులు భయపడుతున్నాయి. సరిగా తినడంలేదు. వాటిని నేను వదిలేయలేను’ అని పేర్కొన్నాడు. గిరికుమార్‌కు ‘JAGUAR KUMAR TELUGU’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది. 84వేల సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారు. తన పెంపుడు జంతువుల గురించి తరచూ అందులో వీడియోలు పెడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే..‘ఆపరేషన్‌ గంగ’ పేరుతో భారత ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. కొందరు తాము పెంచుకుంటున్న పెట్స్‌ను కూడా వెంట తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన పెంపుడు జంతువులను కూడా భారత్‌కు తరలించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని గిరికుమార్‌ ఆశిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని