రికార్డు సృష్టించాలని ముందుకెళ్లి.. కలనెరవేరకుండానే భారతీయ మహిళ మృతి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ (Mt Everest)ను అధిరోహించి, రికార్డు సృష్టించాలని కలలు కన్న ఓ మహిళ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్యం సహకరించక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

Updated : 19 May 2023 12:34 IST

కాఠ్‌మాండూ : 59 ఏళ్ల వయస్సులో గుండెకు పేస్‌మేకర్‌(Pacemaker)తో  అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌( Mt Everest)శిఖరాన్ని అధిరోహించాలనుకున్న ఓ భారతీయ మహిళ(Indian Woman Climber) ఆశలు మధ్యలోనే ఆవిరయ్యాయి. ఆరోగ్యం సహకరించక మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. దాంతో పేస్‌మేకర్‌తో ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి ఆసియా మహిళగా రికార్డు సాధించాలన్న ఆమె కల నెరవేరలేదు. 

సుజానే లియోపోల్డినా జీసస్‌(Suzanne Leopoldina Jesus) స్వదేశం భారత్‌. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోన్న ఆమెకు వైద్యులు పేస్‌మేకర్ అమర్చారు. అయితే, ఎవరెస్ట్‌ అధిరోహించాలని, పేస్‌మేకర్‌ ధరించి ఆ శిఖరాన్ని చేరుకున్న తొలి ఆసియా మహిళగా రికార్డు సాధించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే ప్రాణాలు లెక్కచేయకుండా సిద్ధమయ్యారు. అయితే బేస్‌క్యాంపు వద్ద సాధారణ అభ్యాసాల్లో ఆమె కనీసవేగాన్ని అందుకోలేక ఇబ్బంది పడటం, అలాగే అధిరోహణకు కష్టపడటం చూసిన సిబ్బంది.. ఇక ముందుకెళ్లొద్దని వారించారు. కానీ, వారి మాటలు వినేందుకు ఆమె నిరాకరించారు. తాను అన్నింటికి అనుమతులు తెచ్చుకున్నానని, వెనక్కి వెళ్లనని చెప్పేశారు.

నిర్వాహకుల్లో ఒకరైన దెండి షేర్పా మాట్లాడుతూ.. ‘ఐదురోజుల క్రితమే ఆగిపోవాలని ఆమెను హెచ్చరించాం. కానీ, సుజానే మాత్రం ముందుకువెళ్లాలనే నిర్ణయించుకున్నారు. ముందుకు వెళ్లడానికి అవసరమైన కనీస ప్రమాణాలను అందుకోలేకపోయారు. 250 మీటర్ల దూరం చేరుకోవడానికి ఆమెకు ఐదు గంటలు పట్టింది. మామూలుగా అయితే క్లైంబర్లు ఆ దూరాన్ని 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకుంటారు. మూడు ప్రయత్నాల్లోనూ ఆమె వెనకబడిపోయారు. బేస్‌క్యాంప్‌ నుంచి 5,800 మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత ఆమె ఆరోగ్యం సహకరిచడం లేదని గుర్తించి, బలవంతంగా ఆసుపత్రికి తరలించాం. నేపాల్‌(Nepal)లోని లుక్లా ప్రాంతంలోని ఆసుపత్రిలో చేర్పించాం’అని చెప్పారు. అయితే, ఆమె చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు నేపాల్‌(Nepal) పర్యాటక విభాగం డైరెక్టర్ యువరాజ్‌ ఖటివాడా తెలిపారు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని