BBC row: రాజకీయ ప్రోద్బలంతోనే బీబీసీ డాక్యుమెంటరీ : విదేశాంగ మంత్రి జైశంకర్‌

బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ (BBC Documentary) యాదృచ్ఛికంగా చేసింది కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌  (S Jaishankar) పేర్కొన్నారు. ఇది రాజకీయ ప్రోద్బలంతోనే నిర్మించబడిందన్నారు.

Updated : 21 Feb 2023 21:26 IST

దిల్లీ: దేశంలో బీబీసీ డాక్యుమెంటరీ (BBC Documentary) వివాదంపై భారత విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌ (S Jaishankar) స్పందించారు. బీబీసీ డాక్యుమెంటరీ యాదృచ్ఛికంగా చేసింది కాదని.. రాజకీయ ప్రోద్బలంతోనే ఆ లఘుచిత్రం నిర్మించారన్నారు. రాజకీయాలు కొన్నిసార్లు విదేశాల నుంచి జరుగుతాయన్న ఆయన.. రాజకీయ క్షేత్రంలోకి వచ్చేందుకు ధైర్యంలేని కొందరు వ్యక్తులు మీడియా ముసుగులో ఇటువంటి రాజకీయాలు (Politics) చేస్తారని ఆరోపించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీబీసీ వివాదంపై అడిగిన ప్రశ్నకు విదేశాంగమంత్రి ఎస్‌. జైశంకర్‌ ఈ విధంగా మాట్లాడారు.

‘కేవలం ఒక డాక్యుమెంటరీపై, ఏదో ఒక యూరప్‌ నగరంలో చేసిన ప్రసంగం, ఎక్కడో ఎడిట్‌ చేసే వార్తా పత్రికపై చర్చ కాదు. వాస్తవ రాజకీయాలు. రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు ధైర్యం లేని కొందరు వ్యక్తులు ఇటువంటి ఆటలు ఆడుతుంటారు. ఏదో ఒక స్వచ్ఛంద సంస్థనో, మీడియా సంస్థ పేరు చెప్పి ముసుగు కప్పుకుంటారు. కానీ, వారు చేసేది రాజకీయాలు. మీడియా పేరుతో ఇటువంటి వ్యవహారాలు జరుగుతుంటాయి. విదేశాల్లో ఇటువంటివి చూస్తూనే ఉంటాం. దిల్లీలో ఎన్నికల సీజన్‌ మొదలైందో లేదో నాకు తెలియదు. లండన్‌, న్యూయార్క్‌లో మాత్రం ఎన్నికల సీజన్‌ మొదలైంది’ అని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పష్టం చేశారు. ఇలా ఎన్ని ప్రచారాలు  చేసినా.. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ఇటువంటి అపోహలన్నింటినీ పోగొడుతుందని ఉద్ఘాటించారు.

మరోవైపు 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి.. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ (India: The Modi Question) పేరుతో బీబీసీ రూపొందించిన లఘుచిత్రం ప్రసారాన్ని నిరోధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం ఇప్పటికే సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఇదే సమయంలో ముంబయి, దిల్లీ బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను అధికారులు సర్వే నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, సర్వేలో భాగంగా ప్రైసింగ్‌ డాక్యుమెంటేషన్‌ బదిలీకి సంబంధించి వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఐటీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని