Car Airbags: కారులో 6 ఎయిర్‌ బ్యాగులు.. తగ్గే ప్రసక్తే లేదు

వాహనదారుల భద్రతలో భాగంగా అన్ని కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులను తప్పనిసరి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

Published : 22 Apr 2022 01:32 IST

వాహనదారుల భద్రతే ముఖ్యమంటోన్న కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: వాహనదారుల భద్రతలో భాగంగా అన్ని కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులను తప్పనిసరి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అయితే, ఈ మార్పుల వల్ల కార్ల ధరలు పెరుగుతాయని చెబుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని తయారీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ ప్రయాణికుల భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అక్టోబర్ ఒకటి నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను (నాలుగు సీట్లతోసహా రెండు సైడ్ ఎయిర్‌ బ్యాగ్‌లు) ఏర్పాటు చేయాలని జనవరిలో ప్రతిపాదించింది. కేవలం ఒక నెలలోనే వీటిపై కేంద్రం నుంచి ప్రకటన వస్తుందని అంతా భావించారు. కానీ, తయారీ సంస్థలు చెబుతోన్న కారణాలను పరిగణనలోకి తీసుకుంటోన్న ప్రభుత్వం.. వాటిని విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల అందుబాటు ధరలో దొరికే కార్లు ఖరీదుగా మారతాయని, దాని వల్ల కొనుగోలుదారులు దూరమయ్యే అవకాశం ఉందని తయారీ సంస్థలు ఇటీవల వ్యాఖ్యలు చేశాయి. అయినప్పటికీ తగ్గేదేలే అంటోన్న ప్రభుత్వం భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొంటున్నట్లు సమాచారం. దీంతో నిబంధనలకు తుదిరూపు తెచ్చేందుకు కసరత్తు చేస్తోందన్న మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారులు.. అవి వెలువడడానికి మరికొంత సమయం పడుతుందని అన్నారు.

ఖర్చు తక్కువే..

ఇప్పటికే అన్ని కార్లలో 2 ఎయిర్‌బ్యాగ్‌ల (డ్రైవరు, ముందు సీటు ప్రయాణికునికి) ఏర్పాటు తప్పనిసరిగా ఉండగా.. మరో నాలుగింటి ఏర్పాటు వల్ల అదనంగా వినియోగదారుడికి 75 డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు కాదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ కార్ల తయారీ సంస్థలు మాత్రం ఇందుకు 231 డాలర్ల అదనపు ఖర్చు అవుతుందని చెబుతున్నట్లు సమాచారం. అయితే, తయారీ సంస్థల వాదనను తోసిపుచ్చుతోన్న కేంద్ర ప్రభుత్వం.. విదేశాలకు ఎగుమతి చేసే కార్లకు అదనపు ఎయిర్‌ బ్యాగ్‌లను అమర్చుతున్నప్పటికీ స్థానికంగా అమ్ముతున్న వాటిలో మాత్రం ఆ ఏర్పాటు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. వాస్తవంగా తయారీ సంస్థలు ఎయిర్ బ్యాగ్‌లను అందించాల్సి ఉన్నప్పటికీ వారు ముందుకు రాకపోవడంతో ఈ నిబంధనలు తేవాల్సి వస్తోందని సంబంధిత శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇదే విషయంలోపై ఇటీవల ప్రకటన చేసిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ.. ప్రమాదాలను నివారించేందుకే కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నామని అన్నారు. ప్రమాద సమయంలో కార్లలో ఎయిర్‌బ్యాగులు ఉన్నట్లయితే కేవలం ఒక్క ఏడాదిలోనే 13వేల ప్రాణాలను కాపాడి ఉండేవాళ్లమని గుర్తు చేశారు. ఇప్పటికే వీటిని రవాణాశాఖ నోటిఫై చేసిందన్న ఆయన.. అక్టోబర్‌ 1 నుంచి నిబంధనలు అమలులోకి వస్తాయని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని