Modi: భారత చరిత్ర అంటే బానిసత్వం కాదు.. పోరాటాల స్ఫూర్తి: మోదీ

భారత దేశ చరిత్ర అంటే బానిసత్వం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జనరల్‌ లచిత్‌ బర్ఫుకన్‌ 400వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్ని ఆయన మాట్లాడారు.

Published : 25 Nov 2022 23:35 IST

దిల్లీ: భారత్‌ గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశం కోసం పోరాడి చరిత్ర పుటల్లో అనాథలుగా నిలిచిపోయిన వారి ధైర్యసాహసాలను స్మరించుకుంటోందని చెప్పారు. ఆహోం రాజ్యానికి (ప్రస్తుతం అస్సాం రాష్ట్రం) చెందిన యుద్ధవీరుడు జనరల్‌ లచిత్‌ బర్ఫుకన్‌ 400వ జయంతి ఉత్సవాల్లో ఆయన  పాల్గొన్నారు.  దిల్లీలో నిర్వహించిన ఈ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ.. భారత చరిత్ర అంటే బానిసత్వం కాదని, వలసవాదులు చేసిన కుట్రపై మహావీరుల పోరాట స్ఫూర్తి కూడా చరిత్రలో ప్రతిధ్వనిస్తుందని అన్నారు. మహావీరుల చరిత్ర కేవలం శతాబ్దాలకు మాత్రమే పరిమితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుర్కియన్‌లు, అఫ్గాన్లు, మొఘలులపై వీరోచితంగా పోరాడిన ధీరులకు జన్మనిచ్చిన నేల అస్సాం అని కొనియాడారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దురదృష్ట వశాత్తూ కుట్రలో భాగంగా రచించిన చరిత్రే ప్రజలకు చేరువైందని అన్నారు. దీనిలో భారతీయుల వీరోచిత పోరాటాలకు స్థానం లేకుండా.. దౌర్జన్యాలపై సాగిన ప్రతిఘటనలను ఉద్దేశ పూర్వకంగానే విదేశీయులు అణిచివేశారని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మొఘలుల సామ్రాజ్యకాంక్షను, వారి దాష్టీకాలను ఎదుర్కొన్న లచిత్‌ బర్ఫుకన్‌ వీరత్వాన్ని మోదీ గుర్తు చేశారు. దేశం కోసం రక్తసంబంధీకులను కూడా హతమార్చేందుకు బర్ఫుకన్‌ వెనకంజ వేయలేదని గుర్తు చేశారు. ఆయన జీవితం మనందరిలో స్ఫూర్తి నింపుతుందని, దేశభక్తిని పెంపొందిస్తుందని చెప్పారు. చరిత్రలో ఊహించని విపత్తులను ఎదుర్కొని, విదేశీ ఆక్రమణదారుల హస్తాల్లో చితికి పోయిన భారత్‌.. ఇప్పటికీ అదే శక్తి, చైతన్యంతో అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. 1671లో సరాయ్‌ఘాట్‌ యుద్ధంలో రాజా రాంసింగ్ నేతృత్వతంలో.. అసంఖ్యాక మొఘల్‌ సేనలతో వీరోచితంగా పోరాడి.. వారిని అహోం రాజ్యం నుంచి తరిమికొట్టిన వీరుడే బర్ఫుకన్‌.

విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు దేశానికి వెలుగులు పంచేందుకు బర్ఫుకన్‌ లాంటి వీరులు ఉద్భవిస్తారని మోదీ చెప్పుకొచ్చారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జీవితం ఆధారంగా రూపొందించిన నాటకం ‘జనతా రాజా’ తరహాలో బర్ఫుకాన్‌పై ఓ గొప్ప నాటకాన్ని రూపొందించాలని మోదీ సూచించారు. ఇది ‘వన్‌ ఇండియా.. యునైటెడ్‌ ఇండియా’ సంకల్పానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్‌ బిస్వశర్మ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్ర అంటే ఔరంగజేబు, బాబర్‌, జహంగీర్‌, హుమయూన్‌లు మాత్రమే కాదు.. లచిత్‌ బర్ఫుకన్‌, ఛత్రపతి శివాజీ, గురు గోవింద్‌ సింగ్‌ లాంటి మహోన్నతులు కూడా ఉన్నారన్నారు’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు