American Airlines: దిల్లీ విమానంలో మరో దుశ్చర్య.. తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన

దిల్లీ ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘటన మరువక ముందే, అదే తరహాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Updated : 24 Apr 2023 23:54 IST

దిల్లీ: విమానాల్లో (Flights) తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిసున్న ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగా వెలుగుచూస్తున్నాయి. దిల్లీ ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘటన మరువక ముందే, అదే తరహాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌ నుంచి దిల్లీ వస్తున్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ (American Airlines)కు చెందిన AA 292 విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనపై విమాన సిబ్బంది బాధితుడి వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం విమానం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన తర్వాత మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని విమానాశ్రయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని దిల్లీ పోలీసులకు అప్పగించినట్లు  డీజీసీఏ (DGCA) ఒక ప్రకటనలో తెలిపింది. 

విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకు సివిల్‌ ఏవియేషన్ చట్టం ప్రకారం తోటి ప్రయాణికుడితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటన బాధిత వ్యక్తి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం ఇది మూడోసారి. గతేడాది నవంబర్‌లో న్యూయార్క్‌ నుంచి దిల్లీకి వస్తున్న విమానంలో బిజినెస్‌ తరగతిలో ఓ మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి  మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. అనంతరం డిసెంబర్‌ 6న పారిస్‌-దిల్లీ విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని