Drone Attacks: అలాంటి డ్రోన్లతో సవాళ్లే..! ఆర్మీ చీఫ్‌

తేలికగా లభ్యమవుతోన్న డ్రోన్లు భద్రతా సవాళ్లను మరింత సంక్లిష్టం చేస్తున్నాయని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే పేర్కొన్నారు. అయినప్పటికీ అలాంటి ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటోందని స్పష్టం చేశారు.

Published : 01 Jul 2021 18:55 IST

దీటుగా ఎదుర్కొంటామన్న సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణే

దిల్లీ: తేలికగా లభ్యమవుతోన్న డ్రోన్లు భద్రతా సవాళ్లను మరింత సంక్లిష్టం చేస్తున్నాయని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే పేర్కొన్నారు. అయినప్పటికీ అలాంటి ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటోందని స్పష్టం చేశారు. కేవలం దేశ రక్షణ కోసం డ్రోన్లను వినియోగించడమే కాకుండా శత్రువులు ఉపయోగించే అలాంటి వాటివల్ల కలిగే ముప్పులను కూడా ఎదుర్కొనేందుకు కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థలను రూపొందించుకుంటున్నట్లు చెప్పారు. జమ్మూ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడి అనంతరం ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే ఈవిధంగా స్పందించారు.

శత్రువుల నుంచి కలిగే ముప్పుపై భద్రతా బలగాలకు పూర్తి అవగాహన ఉందని.. వాటిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే స్పష్టం చేశారు. జమ్మూలో డ్రోన్‌ దాడి అనంతర పరిస్థితులపై మాట్లాడిన ఆర్మీ చీఫ్.. ఫిబ్రవరిలో భారత్-పాక్‌ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత నియంత్రణ రేఖ (Line of Control) వెంబడి చొరబాట్లు తగ్గాయన్నారు. ఇలా చొరబాట్లు తగ్గిన కారణంగా కశ్మీర్‌లో ఉగ్రవాదుల సంఖ్య తగ్గిందని.. తద్వారా ఉగ్రవాద సంఘటనలు కూడా తగ్గాయని వెల్లడించారు. అయినప్పటికీ శాంతి, అభివృద్ధిని విధ్వంసం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తూనే ఉంటాయని.. అలాంటి వాటిని తిప్పికొట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. ఇందులో భాగంగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. సరిహద్దు ప్రాంతంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు తమ ఆపరేషన్‌ కొనసాగుతుందని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే స్పష్టం చేశారు.

ఇక డ్రోన్లతో ముష్కరులు జరుపుతోన్న దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్లిన భారత్, మరోవైపు కట్టడి చర్యలను ముమ్మరం చేసింది. ఇదిలాఉంటే, జమ్మూ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణను వేగవంతం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని