Missile Fire: పాకిస్థాన్‌ భూభాగంలో పడిన భారత క్షిపణి..!

భారత రక్షణ వ్యవస్థకు చెందిన క్షిపణి ఒకటి పాకిస్థాన్‌ భూభాగంలో పడింది. సాంకేతిక లోపం కారణంగా ఈ క్షిపణి పాక్‌ భూభాగంలోకి దూసుకెళ్లినట్లు భారత రక్షణశాఖ వెల్లడించింది.

Updated : 12 Mar 2022 07:34 IST

ప్రమాదవశాత్తు జరిగిందన్న భారత రక్షణశాఖ, దర్యాప్తునకు ఆదేశం

దిల్లీ: భారత రక్షణ వ్యవస్థకు చెందిన క్షిపణి ఒకటి పాకిస్థాన్‌ భూభాగంలో పడింది. సాంకేతిక లోపం కారణంగా ఈ క్షిపణి పాక్‌ భూభాగంలోకి దూసుకెళ్లినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన భారత్‌.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఉన్నతస్థాయి దర్యాప్తునకూ ఆదేశించినట్లు పేర్కొంది. ఇదే విషయమై పాకిస్థాన్‌ విదేశాంగశాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత్ ఈ విధంగా స్పందించింది.

‘మార్చి 9వ తేదీన సాధారణ నిర్వహణ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రమాదవశాత్తు క్షిపణి దూసుకెళ్లింది. అనంతరం అది పాకిస్థాన్‌ భూభాగంలో పడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది’ అని భారత రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటన కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.

మరోవైపు భారత్‌ నుంచి చొచ్చుకొచ్చిన ఆ క్షిపణి 40వేల అడుగుల ఎత్తులో, పాక్‌ గగనతలంలోకి 100 కి.మీ చొచ్చుకొని వచ్చినట్లు పాకిస్థాన్‌ వెల్లడించింది. శబ్దవేగం కంటే మూడురెట్ల వేగంతో దూసుకువచ్చి మియాన్‌ చన్నూ నగరంలో కుప్పుకూలినట్లు పాకిస్థాన్‌ వెల్లడించింది. ఇలా పాక్‌ గగనతంలో భారత్‌ ఉల్లంఘనలకు పాల్పడడాన్ని నిరసిస్తూ అక్కడి భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. ఆ క్షిపణి ప్రయోగం పాక్‌ ఆస్తులకు నష్టం కలిగించడంతోపాటు ఇక్కడి పౌరులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల కలిగే పరిణామాలను గుర్తుంచుకోవాలన్న పాక్‌ విదేశాంగశాఖ.. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి, ఫలితాన్ని తెలియజేయాలని భారత రాయబారికి స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పాకిస్థాన్‌ ఆందోళన చెందిన నేపథ్యంలో స్పందించిన భారత్‌.. ప్రమాదవశాత్తు క్షిపణి దూసుకెళ్లినట్లు ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని