Published : 09 Nov 2021 18:00 IST

Rafale: ‘INC అంటే కాంగ్రెస్‌ కాదు.. కమీషన్ల పార్టీ’

‘రఫేల్‌’ ముడుపుల వ్యవహారంపై రాహుల్‌ సమాధానం చెప్పాలి: భాజపా

దిల్లీ: దేశ రాజకీయాల్లో రఫేల్‌ ఒప్పందం వివాదం మరోసారి కాక పుట్టిస్తోంది. ఈ  ఒప్పందం కోసం దసో సంస్థ.. 2007 నుంచి 2012 మధ్య ఓ మధ్యవర్తికి రూ.65కోట్ల ముడుపులు ముట్టజెప్పినట్లు ఫ్రాన్స్‌ పరిశోధనాత్మక జర్నల్‌ ‘మీడియా పార్ట్‌’ సంచలన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై భాజపా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఐఎన్‌సీ) పేరు ఇకపై ‘ఐ నీడ్‌ కమీషన్‌’ పార్టీ అని మార్చాలంటూ ధ్వజమెత్తింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ కూడా గట్టిగానే తిప్పికొట్టింది. అదే నిజమైతే రఫేల్‌ ఒప్పందంపై దర్యాప్తు చేసేందుకు భాజపా ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నిచింది.

మీడియా పార్ట్‌ కథనంపై భాజపా అధికార ప్రతినిధి సాంబిత్‌ పాత్రా నేడు మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఐఎన్‌సీ అంటే ఇకపై ఐ నీడ్‌ కమీషన్‌ పార్టీ. సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక, రాబర్ట్‌ వాద్రా అందరూ కమీషన్లు కావాలనే వారే. రఫేల్‌పై మీడియా పార్ట్‌ ప్రచురించిన కథనంపై రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలి. రఫేల్‌ ఒప్పందంపై మీరు(రాహుల్‌ను ఉద్దేశిస్తూ), మీ పార్టీ ఇన్నేళ్లుగా ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు?ఇప్పుడు నిజమేంటో అందరికీ తెలిసింది. ఈ ఒప్పందం కోసం కమీషన్లు చెల్లించిన 2007- 2012 మధ్య మీ పార్టీనే అధికారంలో ఉంది. బహుశా.. ఈ కమీషన్లతో కాంగ్రెస్‌, గాంధీ కుటుంబం సంతృప్తి చెందనందువల్లే యూపీఏ హయాంలో ఈ ఒప్పందంపై చర్చలు విఫలమై ఉంటాయి’’ అంటూ సాంబిత్‌ పాత్రా ఆరోపించారు.

భయపడొద్దు..!: రాహుల్‌

అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. భాజపా తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని మండిపడింది. ఈ ఆరోపణలు నిజమైతే భాజపా ఎందుకు దీనిపై ఇంతవరకూ దర్యాప్తు చేపట్టలేదో చెప్పాలని డిమాండ్‌ చేసింది. అటు రాహుల్‌ గాంధీ కూడా మీడియా పార్ట్‌ కథనంపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘నిజం మీవైపు ఉన్నంతవరకు.. మీరు దేనికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవినీతి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన పోరాటాన్ని కొనసాగించాలని కాంగ్రెస్‌ నేతలందరినీ కోరుతున్నా. ఆగిపోవద్దు.. అలసిపోపద్దు.. భయపడొద్దు!’’ అని రాహుల్‌ ట్వీట్ చేశారు. 

రఫేల్‌ ఒప్పందం కోసం దసో ఏవియేషన్‌.. మధ్యవర్తి సుషేన్‌ గుప్తాకు రూ.65కోట్లు ముడుపులు చెల్లించినట్లు మీడియా పార్ట్‌ కథనం వెల్లడించింది. మారిషస్‌లో రిజిస్టర్‌ అయిన ఓ బూటకపు కంపెనీ ముసుగులో అగస్టా వెస్ట్‌లాండ్‌ నుంచి సుషేన్‌ లంచాలు తీసుకున్నారని, 2007 నుంచి 2012 వరకు నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా ఆయనకు దసో రూ.65 కోట్ల మేర రహస్య కమిషన్లు చెల్లించినట్లు కూడా ఆధారాలు లభించాయని పేర్కొంది. వీటిపై సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ.. భారత్‌లో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆ ముడుపుల వ్యవహారంలో దర్యాప్తు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొనడం తాజాగా సంచలనంగా మారింది. అయితే ఈ  కథనంపై దసోగానీ, భారత రక్షణ మంత్రిత్వ శాఖ గానీ ఇంకా స్పందించలేదు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts