China Boat Sink: చైనా పడవ మునక.. రంగంలోకి ఇండియన్‌ నేవీ..!

హిందూ మహాసముద్రం (Indian Ocean)లో చైనాకి (China) చెందిన నౌక మునిగిపోవడంపై భారత్‌ స్పందించింది. సహాయక చర్యల్లో భాగంగా ఇండియన్‌ నేవీకి చెందిన గస్తీ విమానాన్ని పంపింది.

Published : 19 May 2023 01:43 IST

దిల్లీ: హిందూ మహా సముద్రంలో (indian Ocean) చైనాకి (china) చెందిన నౌక మునిగిపోయిన నేపథ్యంలో బాధితుల జాడ గుర్తించేందుకు ఇండియన్‌ నేవీ (Indian Navy) రంగంలోకి దిగింది. సహాయక చర్యల కోసం P-81 గస్తీ విమానాన్ని పంపించింది. బుధవారమే ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో ప్రమాద స్థలంలో లభ్యమైన కొన్ని వస్తువులను గుర్తించారు. గురువారం కూడా ఆపరేషన్‌ కొనసాగించినట్లు ఇండియన్‌ నేవీ తెలిపింది. మొత్తం 39 మంది సిబ్బందితో వెళ్తున్న ఓ చేపలు పట్టే నౌక మంగళవారం దక్షిణహిందూ మహాసముద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగి 3 రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు అందులోని సిబ్బంది ఆచూకీపై ఎలాంటి సమాచారం లేదు.

ప్రమాద విషయం తెలుసుకున్న తర్వాత భారత్‌ మానవతా దృక్పథంతో వేగంగా స్పందించింది. తీరానికి దాదాపు 900 నాటికల్‌ మైళ్ల దూరంలోని ప్రమాద స్థలంలో తన నిఘా విమానాన్ని మోహరించి సహాయక చర్యలను చేపట్టింది. అయితే, ఆ ప్రదేశంలో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించిన నేవీ.. బాధితుల జాడపై మాత్రం ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. ‘‘చైనాతో విభేదాలు ఉన్నప్పటికీ.. సముద్ర భద్రతలో బాధ్యతాయుతమైన భాగస్వామిగా ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే భారత్‌ స్పందించింది. నావికా దళ విభాగాలు ఇతర యూనిట్లతో కలిసి రెస్క్యూ ప్రయత్నాలను సమన్వయం చేశాయి. ఇందులో భాగంగానే గస్తీ విమానాన్ని భారత్‌ పంపించింది’’ అని నేవీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై తాజాగా చైనా విదేశాంగ శాఖ మంత్రి  వాంగ్‌ వెన్‌బిన్‌ స్పందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తాజా ఘటనపై ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండోనేషియా, మాల్దీవులు, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాలు విచారం వ్యక్తం చేశాయి. మునిగిపోయిన నౌకలోని సిబ్బంది ప్రాణాలతో బయటపడాలని ఆకాంక్షించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు